Malli Pelli Review In Telugu: మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • నరేష్ (Hero)
  • పవిత్ర లోకేష్ (Heroine)
  • అనన్య నాగల్ల, వనిత విజయ్ కుమార్, శరత్ బాబు తదితరులు.. (Cast)
  • ఎం.ఎస్.రాజు (Director)
  • నరేష్ వి.కె (Producer)
  • అరుల్ దేవ్ - సురేష్ బొబ్బిలి (Music)
  • ఎం.ఎన్.బాల్ రెడ్డి (Cinematography)
  • Release Date : మే 26, 2023

ప్రభాస్-అనుష్క వంటి యంగ్ కపుల్ స్థాయిలో పాపులర్ అయిన ఓల్డ్ కపుల్ నరేష్-పవిత్ర. పలు సినిమాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరూ సహజీవినం చేస్తున్నారంటూ జరిగిన రచ్చ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రచ్చ నేపధ్యంలో తెరకెక్కిన చిత్రమే “మళ్ళీ పెళ్లి”. ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్, పాటలు కంటెంట్ పరంగా బిలో యావరేజ్ అయినప్పటికీ.. నరేష్-పవిత్ర కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ పుణ్యమా అని మంచి హైప్ క్రియేటయ్యింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం..!!

కథ: తెలుగులో ప్రఖ్యాత గాంచిన నటుడు నరేంద్ర (నరేష్). వందల కోట్ల ఆస్తి, మూడు పెళ్లిళ్లు, వరుస సినిమా ఆఫర్లు.. ఏవీ ఆయనకు సంతృప్తినివ్వలేకపోతాయి. ఒకానొక సందర్భంలో సినిమా షూటింగ్ లో భాగంగా కన్నడ నటీమణి పార్వతి (పవిత్ర లోకేష్)ను కలుస్తాడు.

ఆమె కూడా పెళ్లి వల్ల కానీ ఆ పెళ్లి చేసుకున్న భర్త వల్ల కానీ.. సంతోషంగా ఉండలేక ఇబ్బందిపడుతూ జీవితాన్ని నెట్టుకొస్తుంటుంది. లేటు వయసులో వీరిద్దరి నడుమ మొదలైన స్నేహం.. ప్రేమగా ఎలా మారింది? ఆ ప్రేమ ఏ తీరానికి చేరుకుంది? అనేది “మళ్ళీ పెళ్లి” కథాంశం.

నటీనటుల పనితీరు: నటులుగా నరేష్, పవిత్ర లోకేష్ లకు పేరు పెట్టాల్సిన పని లేదు. ఇద్దరూ ఇప్పటికీ ఒకటికి పదిసార్లు, ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో తమ సత్తాను ఘనంగా చాటుకున్నారు. అయితే.. ఈ చిత్రంలో వారు పోషించిన నరేంద్ర-పార్వతీల పాత్రలు వారి నిజజీవిత పాత్రలు కావడం, ఆ పాత్రల్లో వాళ్ళు జీవించేయడం చకచకా జరిగిపోయాయి.

కానీ.. రియాలిటీకి దగ్గరగా ఉన్న ఆ పాత్రలను ప్రేక్షకులు ఓన్ చేసుకోవడం అనేది ఈ సినిమా విషయంలో మాత్రం జరగలేదు. అనన్య నాగల్ల అందాల ఆరబోత, అన్నపూర్ణమ్మ అత్తెసర కామెడీ పెద్దగా వర్కవుటవ్వలేదు. శరత్ బాబు, జయసుధ వంటి సీనియర్ ఆర్టిస్టులు బ్యాగ్రౌండ్ ఆర్టిస్టుల్లా మిగిలిపోయారు.

సాంకేతికవర్గం పనితీరు: సంగీతం, ఛాయాగ్రహణం, ఎడిటింగ్, కలరింగ్, డి.ఐ, డి.టి.ఎస్ మిక్సింగ్, డబ్బింగ్.. ఇలా ప్రతి ఒక్క టెక్నికల్ అంశంలోనూ లెక్కకుమిక్కిలి లోటుపాట్లున్నాయి. సినిమాను త్వరగా రిలీజ్ చేయాలన్న తపనతో చాలా తప్పులను లైట్ తీసుకున్నారు బృందం. అందువల్ల.. అరుచుకుంటూ కాక.. సాధారణంగా కూర్చుని సినిమాను చూసే ప్రేక్షకులు కాస్త ఇబ్బందిపడతారు. దర్శకుడిగా ఎం.ఎస్.రాజుకి ఉన్న క్రెడిబిలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ సినిమా (Malli Pelli) మేకింగ్ & టేకింగ్ కూడా ఆ క్రెడిబిలిటీకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. కొన్ని సన్నివేశాల కంపోజీషన్ చూస్తే.. ఆయన ఎంత వెనుకబడి ఉన్నాడో అర్ధమవుతుంది. కాకపోతే.. అవకాశం ఉన్నా ఎక్కడా అసభ్యకరమైన సన్నివేశాలు, సందర్భాలు ఇరికించకుండా క్లీన్ గా సినిమాని నడిపించి ఫిలిమ్ మేకర్ గా ఆయనకున్న మర్యాదను పోగొట్టుకోలేదు. అలాగే.. చివరి 20 నిమిషాల డీలింగ్ బాగుంది. ఓవరాల్ గా దర్శకుడిగా మరోమారు విఫలయత్నంతో సరిపెట్టుకున్నారు రాజు.

విశ్లేషణ: కనీస స్థాయి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్తే పర్వాలేదు అనిపించే సినిమా “మళ్ళీ పెళ్లి”. ఏదో ఉంటుంది అని ఊహించుకొని వెళ్తే మాత్రం బోల్తా కొడతారు. నరేష్-పవిత్ర కాంబినేషన్ సీన్స్ కి విజిల్స్ కొట్టాలని ఫిక్స్ అయ్యి వెళ్తే మాత్రం చివరి 20 నిమిషాలు మినహా సినిమా మొత్తం ఎంజాయ్ చేయొచ్చు.

రేటింగ్: 1.5/5

Click Here To Read in ENGLISH

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus