“గోదావరి, గోల్కొండ హైస్కూల్” వంటి డీసెంట్ హిట్స్ తో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొన్న సుమంత్ కి రీసెంట్ టైమ్స్ లో సరైన విజయం లభించక జనాలు మర్చిపోయే స్థాయికి చేరుకొన్నాడు. అలాంటి తరుణంలో.. సుమంత్ సినిమా అనగానే అందరూ ఎదురుచూసేలా చేసిన చిత్రం “మళ్ళీ రావా”. డీసెంట్ & లవ్లీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ విశేషంగా ఆకట్టుకొంది. మరి సినిమా ఏ స్థాయిలో అలరించిందో చూద్దాం..!!
కథ : కార్తీక్ (సుమంత్) 14 ఏళ్ల వయసులోనే అంజలి (ఆకాంక్ష సింగ్)ను ప్రేమిస్తాడు. కారణాంతరాల వలన దూరమైనప్పటికీ యుక్త వయసులో పుట్టిన ప్రేమ పెరిగి పైకి చెప్పలేనంత ఇష్టంగా మారుతుంది. మళ్ళీ 13 ఏళ్ల తర్వాత కలుసుకొన్న కార్తీక్-అంజలిలు ఈసారి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకొంటారు. కానీ.. అంజలి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి అమెరికా వెళ్లిపోతుంది. అయితే.. అంజలిని మనస్ఫూర్తిగా ప్రేమించిన కార్తీక్ మాత్రం ఆమె కోసం ఎదురుచూస్తూనే ఉంటాడు.
మరో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమైపోయిన అంజలి తనను ప్రాణంగా ప్రేమిస్తున్న కార్తీక్ దగ్గరికి తిరిగొచ్చిందా? అసలు పెళ్లి చేసుకొందామని ఫిక్స్ అయిన తర్వాత ఆఖరి నిమిషంలో ఎందుకు క్యాన్సిల్ చేసింది? వంటి ప్రశ్నలకు చెప్పిన సింపుల్ సమాధానాల సమాహారమే “మళ్ళీ రావా” చిత్రం.
నటీనటుల పనితీరు : మాస్ క్యారెక్టర్ చేయమంటే కాస్త తడబడతాడేమో కానీ.. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ లో సుమంత్ ఆకట్టుకొనే స్థాయిలో యువ కథానాయకులు సైతం అలరించలేరు. అలాగే “మళ్ళీ రావా”లోనూ కార్తీక్ పాత్రలో సుమంత్ ను తప్ప వేరే హీరోని ఊహించుకోలేం. ఆనందం, బాధ, ప్రేమ, బాధ్యత వంటి ఎమోషన్స్ ను చాలా అద్భుతంగా పండించాడు సుమంత్. ముఖ్యంగా.. ఆఖరి నిమిషంలో హీరోయిన్ తన వద్దకు వచ్చి “నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు” అని చెప్పినప్పుడు తన తల్లిదండ్రులు, స్నేహితుడి ముందు తక్కువైనా పర్లేదు కానీ.. తన ప్రేయసిని ఎవరూ తక్కువగా చూడకూడదు అనుకోని ఆమె అభీష్టాన్ని గౌరవించి ఆమెను సపోర్ట్ చేసే సన్నివేశంలో సుమంత్ ప్రదర్శించిన పరిణితికి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు.
ఆకాంక్ష సింగ్ మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొంది. ఆమెకంటే.. ఆమె చిన్నప్పటి పాత్రలో కనిపించిన పాప బాగా నటించిందని చెప్పాలి. అలాగే.. సుమంత్ చిన్నప్పటి క్యారెక్టర్ ప్లే చేసిన సాత్విక్ తన నటనతో ఆశ్చర్యపరుస్తాడు. ఈ కుర్రోడు సరిగ్గా కాన్సన్ ట్రేట్ చేస్తే తెలుగు ఇండస్ట్రీలో మంచి యంగ్ హీరో అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. సుమంత్ స్నేహితుడి పాత్రలో అభినవ్ ఎక్కడా అతి చేయకుండా సహజమైన నటనతో ఆకట్టుకొన్నాడు. అలాగే.. మిర్చి కిరణ్ ఆఫీస్ మేనేజర్ గా చక్కగా నవ్వించాడు.
సాంకేతికవర్గం పనితీరు : శ్రవణ్ భరద్వాజ్ తన సంగీతంతో మాయ చేశాడనే చెప్పాలి. పాటలు, నేపధ్యం ఎంత ఉల్లాసంగా, వినసోంపుగా ఉన్నాయంటే.. ఇంటికెళ్ళిన తర్వాత కూడా చెవుల్లో మోగుతూనే ఉంటాయి. నేపధ్య సంగీతంతో ప్రతి సన్నివేశాన్ని మనసుకి హత్తుకొనేలా చేశాడు శ్రవణ్. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ ప్లెజంట్ గా ఉంది. నిర్మాణ విలువలు, ఎడిటింగ్ కథకు తగ్గట్లుగా ఉన్నాయి.
దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రైటింగ్ స్కిల్స్ ను మెచ్చుకోవాలి. ఒక ప్రేమకథను మూడు విభిన్నమైన టైమ్ జోన్స్ లో అర్ధవంతంగా ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా చెప్పడం అభినందనీయం. అలాగే.. కమర్షియల్ అంశాల జోలికి పోకుండా కేవలం తాను నమ్ముకొన్న కథను కుదిరినంత సెన్సిబుల్ గా చెప్పాడు. కాకపోతే.. చిన్ననాని ఎపిసోడ్స్ లెంగ్త్ ఎక్కువవ్వడం ఒక్కటే మైనస్. అలాగే.. హీరో లుక్ లో 2012 & 2017 మధ్య వ్యత్యాసం కనిపించేలా కేర్ తీసుకొని ఉంటే సగటు ప్రేక్షకుడు ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండేవాడు. అయినప్పటికీ.. తనకున్న పరిమితులతో దాదాపు అందరూ కొత్త నటీనటుల నుండి మంచి నటన రాబట్టుకొని తాను రాసుకొన్న కథకు న్యాయం జరిగేలా తీసుకొన్న జాగ్రత్తలు ప్రశంసనీయం.
విశ్లేషణ : తమిళ, మలయాళ భాషల్లో వచ్చే లవ్ స్టోరీస్ చూసి ఇలాంటి స్వచ్చమైన, పరిణితి చెందిన ప్రేమకథలు తెలుగులో ఎందుకురావు అని బాధపడేవారికి దొరికిన సమాధానం “మళ్ళీ రావా”. సుమంత్ కి చాన్నాళ్ల తర్వాత మంచి హిట్ ఇవ్వడంతోపాటు.. ప్రేక్షకులకు మంచి సినిమా చూశామన్న అనుభూతి కలిగించే చిత్రమిది. మీ బాల్యాన్ని, ప్రాణ స్నేహితుల్ని, మరపురాని ప్రేమగాధల్ని ఒక్కసారి గుర్తు చేసుకోవడం కోసం ఈ సినిమాని తప్పకుండా చూసితీరాల్సిందే.
రేటింగ్ : 3/5