వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi), కాస్త ఢీలాపడిన చిరంజీవిలా కాంబినేషన్ లో వచ్చిన పండగ సినిమా “మన శంకరవరప్రసాద్ గారు”. వెంకటేష్ (Venkatesh) గెస్ట్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ & సాంగ్స్ ఆ అంచనాలను తగ్గట్లే ఉండడంతో చాలా పాజిటివ్ వైబ్ తో “మన శంకరవరప్రసాద్ గారు” చిత్రం సంక్రాంతి సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమాగా ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!

కథ: సెంట్రల్ హోమ్ మినిస్టర్ కి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శంకర వరప్రసాద్ (చిరంజీవి) (Chiranjeevi) మామ కుతంత్రం కారణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న సతీమణి శశిరేఖ (నయనతార)కు విడాకులు ఇచ్చి, ప్రాణంగా చూసుకునే పిల్లలకి దూరంగా బ్రతుకుతూ ఉంటాడు.
ఎలాగైనా పిల్లలకి చేరువై.. తండ్రిగా తన ప్రేమను వారికి పంచాలనుకుంటాడు.
కట్ చేస్తే.. ముంబైలో ఉన్న తన మామ & భార్యాపిల్లలకి ప్రాణ భయం ఉందని తెలుసుకొని, వాళ్ల ఇంటికి సెక్యూరిటీ ఆఫీసర్ గా ఎంట్రీ ఇస్తాడు.
మరి తండ్రిగా, భర్తగా తన కుటుంబానికి చేరువయ్యాడా? ఇంతకీ తన కుటుంబానికి ప్రాణభయం ఎవరి వల్ల? అందుకు కారణం ఏంటి? దాన్ని వరప్రసాద్ ఎలా ఎదిరించి నిలబడ్డాడు? అనేది “మన శంకరవరప్రసాద్ గారు” సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: చిరంజీవిలో అందరూ ఇష్టపడే బుగ్గలు కనిపించలేదనే చిన్నపాటి నిరాశ తప్పితే.. ఒక నటుడిగా చిరంజీవి నుండి ఏం మిస్ అవుతున్నామో అవన్నీ సుబ్బయ్య హోటల్ లో విందు భోజనంలా వడ్డించేశాడు చిరంజీవి. ఆ చమక్కులు, తళుక్కులు చూస్తూ కూర్చుండిపోతాం. ఎమోషనల్ సీన్స్ కూడా మిస్ అవ్వలేదు. ఇది కదా చిరంజీవి అంటే గుర్తుచేశాడు బాస్. చిరంజీవి డ్రెస్సింగ్ స్టైల్ చాలా రోజుల తర్వాత బాగుండడం మరో విశేషం.
పాత్ర చిన్నదే అయినా.. వెంకటేష్ క్యామియోను భీభత్సంగా ఎంజాయ్ చేస్తాం. అసలు చిరంజీవితో వెంకటేష్ కెమిస్ట్రీ వీరలెవల్లో వర్కవుట్ అయ్యింది. చిరంజీవి పాటకి వెంకటేష్, వెంకటేష్ పాటకి చిరంజీవి డ్యాన్స్ చేయడం, ఒకరి మ్యానరిజమ్స్ మరొకరు ఇమిటేట్ చేయడం అనేది చూడ్డానికి ముచ్చటగా ఉంది.
నయనతార తన పాత్ర తాలూకు డిగ్నిటీని మైంటైన్ చేసే విధానం, ఆమె లుక్స్ & చరిష్మా పాత్రకి మంచి వెయిటేజ్ యాడ్ చేశాయి.
కేథరీన్ ఈ సినిమాలో నయనతార కంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ తీసుకుంది. చిరంజీవితో ఆమె కాబినేషన్ సీన్స్ & ఫన్నీ మూమెంట్స్ అలరిస్తాయి. చివర్లో వెంకటేష్ తో ఆమె క్యారెక్టర్ కి ఇచ్చిన ట్విస్ట్ కూడా బాగుంది.
సుదేవ్ నాయర్ మరోసారి విలనిజంతో మెప్పించాడు. హీరో-విలన్ కాంబినేషన్ సీన్ ఒక్కటే అయినప్పటికీ.. బాగా పండింది.
హర్షవర్ధన్, అభినవ్ గోమటం పంచ్ డైలాగులతో నవ్వించారు.

సాంకేతికవర్గం పనితీరు: ముందుగా దర్శకుడు అనిల్ రావిపూడి గురించి మాట్లాడుకోవాలి.. “పటాస్” తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాల్లో ఒక ప్రాపర్ స్టోరీ & క్యారెక్టర్ బేస్డ్ స్క్రీన్ ప్లే ఉన్న సినిమా “మన శంకరవరప్రసాద్ గారు” అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే మూలకథ అజిత్-నయనతార నటించిన “విశ్వాసం” సినిమాని గుర్తుచేస్తుంది.
అసలు చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో, అచ్చుగుద్దినట్లు అలానే చూపించాడు అనిల్ రావిపూడి, అక్కడే 90% సక్సెస్ అయిపోయాడు. మెగాస్టార్ కామెడీ టైమింగ్, చిలిపి మాటలు, ముద్దుగా కసురుకోవడం వంటివి చూసి ఎన్నాళ్లయ్యిందో కదా అనే భావనను దూరం చేసి, అందరూ మెచ్చిన మెగాస్టార్ ను మళ్లీ ఇంకాస్త స్టైలిష్ గా పరిచయం చేశాడు.
అలాగే.. డైలాగ్ రైటర్ గాను తన పెన్ను పదును మరోసారి రుచి చూపించాడు. ముఖ్యంగా లేడీస్ పార్టీ సీక్వెన్స్, తాపీ మేస్త్రీ & కారణజన్ములు వంటి పంచులు గట్టిగా పేలాయి.
అనిల్ రావిపూడి 9వ సినిమాతో కూడా సక్సెస్ కొట్టేసి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత 100% సక్సెస్ రేషియో ఉన్న ఏకైక దర్శకుడిగా నిలిచాడు. అది కూడా 30 కోట్ల ప్రొడక్షన్ బడ్జెట్ లో ఈస్థాయి అవుట్ పుట్ అనేది మామూలు విషయం కాదు. అది కూడా ఇండస్ట్రీ స్ట్రైక్ ను అధిగమించి మరీ. ప్రస్తుతం అనిల్ రావిపూడి మోస్ట్ వాంటెడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఈ సినిమాతో ఆశ్చర్యపరిచాడు. ఇంట్రడక్షన్ బీజియం, ఫాదర్ సెంటిమెంట్ ని ఎలివేట్ చేస్తూ వచ్చే ఇంగ్లీష్ పాట, మిక్సింగ్ క్వాలిటీ వింటున్నప్పుడు.. ఏంటి ఇదంతా భీమ్స్ చేసిందేనా?! అని ఆశ్చర్యపోవడం ఖాయం. ఆ ఆశ్చర్యానికి కారణంగా భీమ్స్ గత చిత్రం “మాస్ జాతర”లో మనోడి మ్యూజిక్ వర్క్ అని చెప్పాలి. అయితే.. భీమ్స్ ని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లీగ్ లో నిల్చోబెట్టే సినిమా ఇది.
సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ వంటివన్నీ నిర్మాతను ఎంతలా సేవ్ చేశాయంటే.. ఎక్కడా అనవసరమైన ఖర్చు కనిపించలేదు, ఒక్క ఫ్రేమ్ కూడా ఇబ్బందికరంగా లేదు. ఈ విషయంలో ప్రీ-ప్రొడక్షన్ ను చాలా ప్లాన్డ్ గా డిజైన్ చేసుకున్న టీమ్ ను మెచ్చుకోవాలి.

విశ్లేషణ: సంక్రాంతి సినిమాలకి లాజిక్స్ అవసరం లేదు, మ్యాజిక్ ఉంటే సరిపోద్ది అనేది ఇండస్ట్రీ నమ్మే సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్న అనిల్ రావిపూడి, తన టార్గెట్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్ తోపాటుగా మెగా అభిమానులు మరియు సగటు సినిమాలు అభిమానులు కూడా సంతృప్తి చెందేలా తెరకెక్కించిన సినిమా ఇది. చిరంజీవి శ్వాగ్, వెంకటేష్ ఎనర్జీ, భీమ్స్ బీజియం కలగలిసి థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ కి పండగ స్పెషల్ ఫుల్ మీల్స్ పెట్టడం ఖాయం. అనిల్ రావిపూడి మళ్లీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొట్టేశాడనే చెప్పొచ్చు.

ఫోకస్ పాయింట్: పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్!
రేటింగ్: 3.5/5
