మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల బరిలో అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న మంచు విష్ణు మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఉదయం ప్రకాష్ రాజ్ చెప్పిన ప్రతి అంశానికి ఆయన వివరణ ఇచ్చారు. ‘మా’లో సుమారు 190మంది 60 ఏళ్లకు పైబడిన వాళ్లు ఉన్నారని.. వాళ్లందరికీ వ్యక్తిగతం ఫోన్ చేసి ‘మీకు పోస్టల్ బ్యాలెట్ కావాలా..? నేరుగా వచ్చి ఓటేస్తారా..?’ అని అడగ్గా.. వంద మందికి పైగా నేరుగా వచ్చి ఓటు వేస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు.. పరుచూరి బ్రదర్స్ లాంటి పెద్దలు మాత్రం పోస్టల్ బ్యాలెట్ కి వెళ్తామని చెప్పారు.
పోస్టల్ బ్యాలెట్ కావాలంటే రూ.500 కట్టమని ఎన్నికల సంఘం ‘మా’ సభ్యులకు మెసేజ్ పంపించింది. దాంతో పలువురు పెద్దలు తనకు ఫోన్ చేసి అడిగారాని.. ఈ ఎన్నికల్లో ప్రతీ ఓటు ముఖ్యమని ‘మీ అందరి తరఫున ఆ రూ.500 నేను కడతా’ అని వాళ్లకు చెప్పానని మంచు విష్ణు తెలిపారు. ఇదే విషయమై ఎన్నికల సంఘం దగ్గరకి వచ్చి అడిగామని.. వాళ్లు కూడా ఒప్పుకున్నారని.. దీంతో న్యాయబద్ధంగా డబ్బులు కట్టమని అన్నారు.
కొన్ని గంటల తరువాత ఎన్నికల సంఘం నుంచి ఫోన్ వచ్చిందని.. ‘పోస్టల్ బ్యాలెట్ కు డబ్బులు చెల్లించడానికి సభ్యులకు సమయం ఇస్తాం. మీ డబ్బులు మీరు తీసుకెళ్లండి’ అని చెప్పారని.. వెంటనే వచ్చి డబ్బులు తీసుకున్నామని.. అంతా లీగల్ గానే జరిగిందని వివరించారు. ఇవేవీ తెలియకుండా ప్రకాష్ రాజ్ నోరు పారేసుకుంటున్నారని.. ఓటు అడిగే హక్కు నాకుందని ఫైర్ అయ్యారు మంచు విష్ణు.