తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ చేసుకోవడానికి మంచి లొకేషన్లు ఎన్ని ఉన్నా.. మన మేకర్లు మాత్రం వేరే రాష్ట్రాలకు, ప్రాంతాలకు వెళ్తుంటారు. దానికి కారణాలు కూడా ఉన్నాయనుకోండి.. మన దగ్గర సినిమా షూటింగ్ అంటే జనాలను కంట్రోల్ చేయలేం. అందుకే స్టార్లు, టెక్నీషియన్ల గురించి తెలియని ప్రాంతాలకు వెళ్లి ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ చేసుకుంటూ ఉంటారు. ‘పుష్ప’ సినిమా కోసం టీమ్ తమిళనాడుకి వెళ్లింది. మరికొన్ని సినిమాలు కూడా తమిళనాడు, కేరళలో షూటింగ్ జరుపుకుంటున్నాయి.
మన వాళ్లు అక్కడికి వెళ్లి షూటింగ్ జరుపుతుంటే.. కోలీవుడ్ కి చెందిన ఫిల్మ్ మేకర్స్ తెలుగు రాష్ట్రాల మీద దృష్టి పెడుతున్నారు. రజినీకాంత్ ‘అన్నాత్తే’, అలానే అజిత్ ‘వాలిమై’ సినిమాల షూటింగ్ హైదరాబాద్ లో జరిగాయి. విక్రమ్ ‘కోబ్రా’ షూటింగ్ కూడా హైదరాబాద్ లోనే నిర్వహించారు. ఇక మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్ ను చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లో జరుపుతుండడం విశేషం. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో కొన్ని రోజులు పాటు షూటింగ్ ని నిర్వహించారు.
ఇప్పుడు చిత్రబృందాన్ని తీసుకొని రాజమండ్రికి వెళ్లారు మణిరత్నం. ముందు తన టీమ్ తో వెళ్లి ఆ ప్రాంతంలో రెక్కీ చేసి వచ్చిన ఈ దర్శకుడికి అక్కడి లొకేషన్స్ బాగా నచ్చాయట. చారిత్రిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి అక్కడి లొకేషన్స్ బాగా సూట్ అవుతాయని భావించిన మణిరత్నం.. ఇప్పుడు లాంగ్ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ టీమ్ మొత్తం రాజమండ్రిలోనే ఉంది. త్వరలోనే అటవీ నేపధ్యంలో సాగే సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు.