ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి సరస్వతి (88) ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మణిశర్మ సోదరుడు రామకృష్ణ నివాసంలో ఆమె కన్నుమూశారని… సోమవారం ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. మణిశర్మ తల్లి కన్ను మూయడంతో సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఇక మణిశర్మ సంగీతంపై కుటుంబం ప్రభావం గురించి చూస్తే.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టిన మణిశర్మకు సినిమాలంటే చిన్నతనం నుండి ఆసక్తి. సంగీతం, సినిమాల పట్ల ఆయన ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు అప్పటి నుండే మణిశర్మకు వయోలిన్, మాండోలిన్, గిటార్ వాయిద్యాలను నేర్పించారు. అలా 1982లో సుమారు 18 ఏళ్ల వయసులోనే చదువు ఆపేసి సంగీత రంగంలోకి దిగిపోయారు మణిశర్మ. ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని భార్యతో కలసి మద్రాసు వెళ్లిపోయారు.
ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు సత్యం దగ్గర కీ బోర్డ్ ప్లేయర్‌గా మణిశర్మ తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారు. కొన్నేళ్ల తర్వాత సంగీత దర్శకుడిగా మారారు. ఆ తర్వాత స్టార్ హీరోలు, చిన్న హీరోలు అని లేకుండా వరుస సినిమాలు చేస్తూ వచ్చారు. 200కి పైగా సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఇదంతా మా అమ్మ చలవే అని అంటుంటారు మణిశర్మ. ప్రస్తుతం మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీత దర్శకుడిగా చేస్తున్నారు.