మాస్ మహారాజా మారాల్సిన సమయం వచ్చింది!

“ప్రయోగాలు చేస్తుంటే, ప్రజలు సినిమాలు చూడడం లేదండీ. అందుకే రొటీన్ అయినా సరే కమర్షియల్ సినిమాలవైపే మొగ్గుచూపాల్సి వస్తుంది” అంటూ “టచ్ చేసి చూడు” సినిమా విడుదలకు ముందు రవితేజ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు అందరికీ బాగా గుర్తుండిపోయాయి. అయితే.. పోనీ రవితేజ అనుకొంటున్నట్లు కమర్షియల్ సినిమాలేమైనా విజయం సాధించాయా అంటే అదీ లేదు. అంతెందుకు “టచ్ చేసి చూడు” కూడా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు రవితేజ ప్లానింగ్ బాలేదు అనుకోవాలా లేక ప్రేక్షకుల ఆలోచనాధోరణిని వారి టేస్ట్ ని రవితేజ సరిగా అర్ధం చేసుకోలేకపోయాడు అనుకోవాలా.

ఇక్కడ తప్పు ప్రేక్షకులదా, రవితేజ స్టోరీ సెలక్షన్ దా అనే విషయం పక్కనపెడితే.. సినిమా మేకింగ్ లో రోజుకో మార్పు వస్తున్నట్లే, సినిమాలు చూసే విధానంలోనూ మార్పులొస్తున్నాయి. మాస్ మసాలా సినిమాల్లోనూ విశేషమైన ఎంటర్ టైన్మెంట్ లేకపోతే జనాలు చూడట్లేదు. అలాగని ప్రయోగాత్మక చిత్రాలు చేసినా వాటిలో సరైన కంటెంట్ ఉంటే తప్పితే ప్రేక్షకులు కనీసం థియేటర్ల వైపు కూడా చూడడం లేదు. ఈ విషయాన్ని రవితేజ మాత్రమే కాదు మాస్ మసాలా సినిమాలను బేస్ చేసుకొని స్టార్ డమ్ బిల్డ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్న హీరోలందరూ దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయమిది. ఒక్క తెలుగులో తప్ప తమిళ,, మలయాళ, కన్నడ వంటి సౌత్ పరిశ్రమలన్నీ సరికొత్త ప్రయోగాలు చేస్తుండగా మనోళ్ళు మాత్రం ఇంకా ఫార్ములా సినిమాలు పట్టుకొని వేలాడుతుండడం మాత్రం సిగ్గుపడాల్సిన విషయం. కమర్షియల్ సినిమాలతోపాటు ప్రయోగాలు కూడా చేయాల్సిన సమయం ఆసన్నమైంది. చూద్దాం.. ఆడియన్స్ పాయింటాఫ్ వ్యూని దర్శకనిర్మాతలు ఏమేరకు అర్ధం చేసుకొంటారో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus