తొలి సినిమాతోనే తనదైన ప్రత్యేకతను చూపించారు దర్శకుడు కరుణ కుమార్ (Karuna Kumar). ‘పలాస 1978’ అంటూ డేరింగ్ స్టెప్‌తో సినిమాల్లో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. ఉత్తరాంధ్రకు చెందిన ఆయన.. ఆ ప్రాంతంలోని ఓ మూలకుంటే పట్టణం చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో జరిగిన కథ (ఊహాజనిత)ను చూపించి మెప్పించారు. ఆ సినిమా విజయంతో ఆయనలోని టాలెంట్ బాగా ఎలివేట్ అయింది. కథల మీద ఆయన పట్టూ తెలిసింది. రెండో సినిమాగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ (Sridevi Soda Center) చేసినా.. అది సరైన ఫలితం ఇవ్వలేదు.
సెకండ్ సినిమా గండం అని ఇండస్ట్రీలో అనుకుంటే కాదు కాదు ఆ కథలో ఇతరుల వేలు ఎక్కవై అలా అయింది ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మరో డిఫరెంట్ కథాంశంతో ‘మట్కా’ (Matka) అనే సినిమా వరుణ్‌తేజ్‌తో చేశారు. ఈ నెల 14న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సినిమా గురించి, టాలీవుడ్‌లో కథల గురించి ఆయన మాట్లాడారు. మన సినిమాల కథల విషయంలో కాస్త వెనుకబడ్డామని కొందరు అంటుంటారు అని, వాళ్లే పక్క భాషలవైపు చూడమని అంటుంటారనేలా కరుణ కుమార్ (Karuna Kumar) మాట్లాడారు.
నిజానికి కుల వివక్షపై అందరికంటే ముందు మనమే సినిమా చేశామని గుర్తు చేశారు. అదే మన ‘మాలపిల్ల’ అని చెప్పారు. గురజాడ, కందుకూరి వీరేశలింగం పంతులు లాంటి వాళ్ల రాసిన గొప్ప సాహిత్య వారసత్వం తెలుగులో ఉందని చెప్పారు. మనం తీసిన డిఫరెంట్ సినిమాలు ఎవరూ తీయలేదు. ‘మాయాబజార్’, ‘పాతాళ భైరవి’ లాంటి గొప్ప సినిమాలు మనం తీసినవే అని గుర్తుంచుకోవాలి అన్నారు.
బెంగాలీ తర్వాత ఉత్తమ సాహిత్యం తెలుగులోనే ఉంది. కారా మాస్టర్ కథానిలయంలో ఒకటిన్నర లక్షల కథలు ఉన్నాయని మన పెద్దలు చెబుతుంటారు. అంత విస్తృత పరిధి ఉన్న సంస్కృతి తెలుగు నేలదని, మనవైన ఆ కథల్ని ఎవ్వరూ తెరపైకి తీసుకు రావడం లేదనేదే తన ఫిర్యాదు అని అన్నారు. తాను మన మూలాల్లోని కథల్నే చెప్పానని అన్నారు.