మీడియా మొఘల్ రామోజీరావు (Ramoji Rao) మరణ వార్త సినీ, పొలిటికల్ వర్గాలను షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ ప్రముఖులు రామోజీరావు మృతికి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఒక అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయిందంటూ ఎవ్వరికీ తలవంచని మేరుపర్వతం దివికేగిందంటూ ప్రముఖులు ఎమోషనల్ అవుతున్నారు. రామోజీరావు సక్సెస్ స్టోరీ ఎంతోమందిలో స్పూర్తిని నింపిందనే సంగతి తెలిసిందే. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు ఎన్నో సినిమాలను నిర్మించగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సందర్బాలు సైతం ఎక్కువగానే ఉన్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), తరుణ్ (Tarun Kumar) , ఉదయ్ కిరణ్ (Uday Kiran) ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ ద్వారానే టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారనే సంగతి తెలిసిందే. అయితే ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై 100 సినిమాలను నిర్మించాలనేది రామోజీ రావు కోరిక కాగా ఆ కోరిక తీరకుండానే ఆయన చనిపోయారు. రామోజీరావు ఎక్కువగా పరిమిత బడ్జెట్ తో సినిమాలను నిర్మించి మంచి లాభాలను సొంతం చేసుకున్నారు.
అభిరుచి గల సినిమాలను నిర్మించి రామోజీరావు ఎంతోమంది కెరీర్ కు తన వంతు సహాయం చేశారు. మరోవైపు రేపు ఉదయం రామోజీ రావు అంత్యక్రియలు జరగనున్నాయని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు చేయనున్నారు. రామోజీరావు పార్థివ దేహం వల్ల సినీ ప్రముఖులు నివాళులు అర్పించడంతో పాటు రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని చాలామంది ప్రముఖులు వెల్లడించారు.
జర్నలిజం రంగంతో పాటు సినిమాల్లో ఆయన చెరగని ముద్ర వేశారు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన సినిమాలలో మయూరి, మౌన పోరాటం, ప్రతిఘటన లాంటి సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. రామోజీరావు నిర్మించిన సినిమాలలో స్త్రీ పాత్రలు బలంగా ఉంటాయని చాలామంది భావిస్తారు.