సినిమాలు నిర్మించడం అంత సులువా… ఏమో వరుస సినిమాలు ప్రకటిస్తున్న నిర్మాతలను చూస్తే సులభమేమో అనిపిస్తుంటుంది. అయితే మెగా ఫ్యామిలీని చూస్తే కష్టమే అనిపిస్తుంటుంది. ఎందుకంటే నిర్మాణ సంస్థలు ప్రకటించి… వాటి మీద సినిమాలు తీయడంలో పూర్‌గా ఉంటుంటుంది మెగా ఫ్యామిలీ. తాజాగా పవన్ కల్యాణ్ 15 సినిమాలు నిర్మిస్తాం అని ప్రకటించిన నేపథ్యంలో… గతంలో మెగా కుటుంబం నుండి వచ్చిన నిర్మాణ సంస్థల గురించి టాపిక్ చర్చకు వచ్చింది.
మెగా ఫ్యామిలీలో హీరోలకు కొదవలేదు కానీ, నిర్మాతలకు మాత్రం కొదవ ఉందనే చెప్పాలి. గీతా ఆర్ట్స్, అంజనా ప్రొడక్షన్స్, కొణిదెల ప్రొడక్షన్స్ అని మూడు ఉన్నాయి. అందులో గీతా ఆర్ట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ మాత్రమే సినిమాలు చేస్తున్నాయి. అందులో గీతా ఆర్ట్స్ మెగా ఫ్యామిలీతో సినిమాలు తీసి చాలా రోజులైంది. కొణిదెల ప్రొడక్షన్స్ కేవలం చిరంజీవి సినిమాలకే పరిమితం అయిపోయింది. ఇక అంజనా ప్రొడక్షన్స్ సంగతి తెలిసిందే. ‘ఆరెంజ్’ దెబ్బకి మళ్లీ ఆ ఊసే లేదు.
అయితే ఈ ప్రొడక్షన్ హౌస్‌లు ఏవీ కాకుండా… రామ్‌చరణ్ ఆరేళ్ల క్రితం ‘వైట్ హార్స్’ అనే పేరుతో ఓ నిర్మాణ సంస్థ ప్రకటించాడు. అందులో కుర్ర హీరోలు, కొత్త దర్శకులు, ప్రతిభావంతులతో సినిమా అని ప్రకటించాడు. కానీ ఇప్పటివరకు ఆ ఊసే లేదు. అంతకుముందే పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేరుతో పవన్ కూడా ఓ నిర్మాణ సంస్థ ప్రారంభించాడు. దాని మీద ఏవో రెండు సినిమాలు చేసినట్లున్నాడు. అంటే పెద్దగా యాక్టివ్‌గా లేనట్లే. దీంతో మెగా ఫ్యామిలీ నిర్మాణ సంస్థలు ప్రకటించినా అందులో పెద్దగా సినిమాలు చేయరు అనే మాట ఇప్పుడు చర్చకు దారి తీసింది. అయితే ఈసారి పవన్ కచ్చితంగా క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీద సినిమాలు చేస్తాడు అంటున్నారు. చూద్దాం. మరి చరణ్ మాటేంటో.