తెలుగుతో పాటు తమిళ, హిందీ సినీ ఇండస్ట్రీలు ఇప్పుడు బయోపిక్ ల తీయడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి. అప్పట్లో వివిధ రంగాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రముఖుల జీవితాలలో కొన్ని అంశాల్ని తీసుకుని.. వాటికి కమర్షియల్ హంగులు జోడించి క్యాష్ చేసుకోవాలని చాలా మంది దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే సావిత్రి జీవిత ఆధారంగా వచ్చిన ‘మహానటి’, ఎన్టీఆర్ జీవిత ఆధారంగా వచ్చిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ , వై.ఎస్.ఆర్ బయోపిక్ ‘యాత్ర’ వంటివి వచ్చాయి.
ఇదిలా ఉండగా.. తాజాగా విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇది కూడా స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కినదే అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘చిరంజీవి బయోపిక్’ కు సంబందించిన ప్రశ్నలు కూడా మెగాస్టార్ కు ఎదురయ్యాయి. దానికి సూటిగా సమాధానం చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ‘ నా బయోపిక్ అంటూ తీస్తే అది రాంచరణ్ తో మాత్రం వద్దు. చరణ్ అయితే నా పాత్రకి వందకి.. వంద శాతం న్యాయం చేస్తాడు. అందులో సందేహం లేదు. కానీ నా పోలికలు ఎక్కువగా సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ లకు వచ్చాయని చాలా మంది చెబుతుంటారు. కాబట్టి వారిలో ఎవరైనా ఒకరు నటిస్తే బాగుంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు మెగాస్టార్.