‘జీవితాన్ని రివైండ్ చేసిన ఒక సంవత్సరం వెనక్కి వెళ్లే అవకాశం ఇస్తే ఏం చేస్తారు?’ ఈ ప్రశ్న మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఏం చేస్తారు? ఫలానా ఊరు వెళ్తాం, అప్పుడు కలవకుండా మిస్ అయిన ఫ్రెండ్‌ని కలుస్తాం, ఆ రోజు ఎలా ఉందో మళ్లీ చూస్తాం, ఒక వేళ ఆ రోజు మీ పుట్టిన రోజు అయి ఉంటే మరోసారి ఆ రోజు జరుపుకుంటాం అంటూ రకరకాల ఆన్సర్స్ వస్తాయి. అసలు అలా వెనక్కి వెళ్లే అవకాశం వస్తుందో లేదో పక్కన పెడితే… మన ఆలోచనలు ఇలా చాలా రకాలుగా ఉంటాయి. మరి ఇదే మాట మెగాస్టార్ చిరంజీవిని అడిగితే… ‘సామ్‌జామ్’లో సమంత ఇదే పని చేసింది.
‘లైఫ్‌ని రివైండ్ ఒక్క విషయాన్ని మార్చాలనుకుంటే ఏం చేస్తారు’ అని చిరంజీవిని సమంత షోలో అడిగింది. దానికి చిరు భలే సమాధానం ఇచ్చారు. ‘‘నిజంగా అలా జీవితాన్ని రివైండ్ చేసి వెళ్లగలిగితే.. ఒక సంవత్సరం వెనక్కి వెళ్లి… చైనాలో కరోనా వైరస్ లీక్ అయిందని అంటున్నారో ఆ బిల్డింగ్‌ను భూస్థాపితం చేస్తా. ఆ వైరస్ రాకుండా చూస్తా’ అంటూ చిరంజీవి చెప్పారు. భలే ఉంది కదా… మనకు కూడా అలాంటి అవకాశం వస్తే ఆ బిల్డింగ్‌ని పిండి పిండి చేసేయమూ… చిరంజీవి కూడా అంతే.
చాలామంది అభిమానులు చిరంజీవిని సూపర్ హీరో అని అంటుంటారు. మరి చిరంజీవి దృష్టిలో సూపర్ హీరో ఎవరు? ఈ ప్రశ్న చాలామందిలో ఉంటుంది. అదే మాట సామ్‌జామ్‌లో కూడా వినిపించింది. మీరు ఏ సూపర్ హీరో అవ్వాలనుకుంటున్నారు అని అడిగి సమంత ‘సూపర్ మ్యాన్, హీ మ్యాన్ అంటూ’ కొన్ని పేర్లు చెప్పింది. దానికి చిరంజీవి ‘హనుమాన్’ అని చెప్పారు. ‘హనుమాన్’ని మించి సూపర్ హీరో ఎవరు ఉంటారు అంటూ తన ఆరాధ్య దైవం గురించి చెప్పుకొచ్చారు చిరు.