సినిమాల మీద చిరంజీవికి (Chiranjeevi) ఉన్న అవగాహన గురించి మనం ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకోవాలా చెప్పండి. సుమారు 45 ఏళ్ల కెరీర్ ఆయనది. అందులో 155 సినిమాలు ఉన్నాయి. ఎంతమంది దర్శకులతో పని చేశారు. ఎన్ని రకాల కథలు చేశారు లాంటి లెక్కలేమీ చెప్పం కానీ.. ఆ అనుభవంతో ఆయన చెప్పిన విషయాలు, ఇండస్ట్రీ గురించి చేసే విశ్లేషణలు పక్కాగా ఉంటాయి. తాజాగా చిరంజీవి టాలీవుడ్ సినిమాలు – ఫలితాల మీద ఓ అనాలసిస్ ఇచ్చారు.
Chiranjeevi
సత్యదేవ్ (Satya Dev) కొత్త సినిమా ‘జీబ్రా’ (Zebra) ప్రచార కార్యక్రమంలో ఇటీవల పాల్గొన్న చిరంజీవి చెప్పిన ఆ ఎనాలసిస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరోనా – లాక్‌డౌన్ సమయంలో మన ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడడంతో ఇక చిన్న సినిమాలు చూడటానికి థియేటర్లకు రారు అనే మాటలు వినిపించాయని.. దాంతో చాలామంది లాగే తానూ ఆలోచనలో పడ్డానని చిరంజీవి చెప్పారు. అయితే ఈ ఏడాది అది అబద్దమని తేలిందని చెప్పారు.
ఈ ఏడాది వచ్చిన సినిమాలు వాటి విజయాలు చూస్తే.. కొన్ని చిన్న సినిమాలు భారీ విజయాలు సాధించాయని, అది తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. భారీ సినిమాలు విజయం సాధించడంతో పాటు చిన్న సినిమాలూ ఆడినప్పుడే పరిశ్రమ కళకళలాడుతుంది అని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఆయన ‘హను – మాన్’(Hanu Man) , ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu) , ‘టిల్లు స్క్వేర్’(Tillu Square), ‘మత్తు వదలరా 2’(Mathu Vadalara 2), ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar), ‘క’(KA), ‘అమరన్’ (Amaran) లాంటి సినిమాల పేర్లు ప్రస్తావించారు.
అంతేకాదు సినిమాల ఫలితాల విషయంలో ప్రేక్షకుల తప్పు ఎప్పుడూ ఉండదని.. సినిమాలు ఆడకపోతే అది కచ్చితంగా తమ తప్పే అని చెప్పారు. మంచి సినిమాలు వచ్చినప్పుడు ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటున్నాయని గుర్తు చేశారు. ఈ లెక్కన సినిమాల విషయంలో, ఫలితాల విషయంలో సినిమా జనాలు ఏమన్నా జాగ్రత్తపడతారేమో చూడాలి. ఎందుకంటే పైన చెప్పుకున్నాంగా చిరంజీవి విశ్లేషణ ఎందుకు స్పెషలో? ఆయన సీనియారిటీయే ఆ స్పెషల్.