కన్నడ సెన్సేషన్ ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తోందో తెలిసిందే. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, నటించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే, ఇంత పర్ఫెక్ట్‌గా తీసిన సినిమాలో ఓ చిన్న తప్పును నెటిజన్లు కనిపెట్టారు. ఇప్పుడదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.2022లో వచ్చిన ‘కాంతార’ కథ వర్తమానంలో జరుగుతుంది. కానీ, ‘కాంతార: చాప్టర్ 1’ కథ మాత్రం 16వ శతాబ్దం నేపథ్యంలో సాగుతుంది. దీంతో ఆ కాలానికి తగ్గట్టుగా సెట్టింగ్స్, కాస్ట్యూమ్స్ విషయంలో డైరెక్టర్ రిషబ్ శెట్టి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే, ఒకే ఒక్క సీన్‌లో చిత్రయూనిట్ అడ్డంగా దొరికిపోయింది.
రీసెంట్‌గా మేకర్స్ రిలీజ్ చేసిన ‘బ్రహ్మకలశం’ ఫుల్ వీడియో సాంగ్‌లో ఈ మిస్టేక్ బయటపడింది. ఈ పాటలో గూడెం ప్రజలంతా కలిసి సామూహిక భోజనాలు చేసే సీన్ ఒకటి ఉంది. అక్కడే, ఆ సీన్‌కు ఏమాత్రం సంబంధం లేని ఓ 20 లీటర్ల ప్లాస్టిక్ వాటర్ క్యాన్ కెమెరా కంటపడింది. బహుశా, షూటింగ్ సమయంలో దాన్ని పక్కకు తీయడం మర్చిపోయి ఉంటారు.
ఈ సాంగ్ వీడియోలో సరిగ్గా 3 నిమిషాల 6 సెకన్ల దగ్గర మీరు కూడా ఈ తప్పును స్పష్టంగా చూడొచ్చు.ఈ చిన్న పొరపాటును పసిగట్టిన నెటిజన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లు తీసి వైరల్ చేస్తున్నారు. ‘16వ శతాబ్దంలోనే ప్లాస్టిక్ వాటర్ క్యాన్లు వచ్చేశాయా రిషబ్ అన్నా?’ అంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే, ఈ ఒక్క చిన్న మిస్టేక్ మినహా సినిమా అద్భుతంగా ఉందని, ఇలాంటివి పెద్ద ప్రాజెక్టులలో సహజమేనని ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు.