ఒక సినిమా గురించి ఇంకో సినిమా దర్శకుడు మాట్లాడటం, ఆ తర్వాత అది పెద్ద విషయం అవ్వడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున చర్చలు జరిగి, రచ్చ అవ్వడం గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతోంది. అందులో కామెంట్స్ పడ్డ సినిమా బ్లాక్‌బస్టర్ అయితే ఇంకా పెద్ద రచ్చ అవుతోంది. ఇప్పుడు ఇదే తరహా పరిస్థితి ప్రముఖ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటికి (Mohana Krishna Indraganti) ఎదురవుతుందా? ఏమో ఆయన మాటలు వింటే అలానే అనిపిస్తోంది. ‘సారంగపాణి’ (Sarangapani Jathakam) అనే సినిమాను ఆయన చాలా నెలల క్రితమే పూర్తి చేశారు.
ఇప్పుడు రిలీజ్ చేద్దామని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు బ్లాక్‌బస్టర్ సినిమాల గురించి మాట్లాడారు. సినిమాల గురించి మోహన్‌కృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ.. ఏదైనా అసక్తి నుండో, ఏదైనా వెనుకబాటుతనం నుండో, కుంగిపోయిన ఘటనల నుండో, అన్యాయం జరిగిన చోటు నుండో హింస పుడుతుంది. అలాంటి హింసను అలా చూపించినప్పుడే విలువ ఉంటుంది. హీరోయిజాన్ని ఎలివేట్ చేద్దామని హింసను చూపిస్తే సెట్ అవ్వదు అంటూ సినిమాల విషయంలో, అందులో హింస విషయంలో ఇంద్రగంటి మాట్లాడుతూ చెప్పిన మాటలు ఇవీ.
ఈ మాటలు ఆయన అన్న నేపథ్యంలో ఆయన దగ్గర ‘యానిమల్’ (Animal) సినిమా ప్రస్తావన వచ్చింది. ఆ సినిమా నచ్చిందా అని అడిగితే నాకు నచ్చలేదు అని చెప్పేశారు. అక్కడితో ఆగకుండా ‘యానిమల్’ సినిమా చూస్తే కొన్ని చోట్ల నవ్వు వచ్చింది అని కూడా చెప్పారు. ఇంకా ఇక్కడ కూడా ఆగకుండా అయినా ఈ సినిమా గురించి మాట్లాడితే సరికాదు అనే అర్థంలో ముగించేశారు. మరి ‘పుష్ప’ సినిమాల సంగతి ఏంటి అనడిగితే.. ఇంకో కాంట్రవర్శీ సమాధానం ఇచ్చారాయన.
‘పుష్ప: ది రైజ్’ (Pushpa) సినిమా బాగా నచ్చిందని, అయితే ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2) నచ్చలేదు అని చెప్పారు. రెండో ‘పుష్ప’లో హీరోయిజం మాత్రమే ఉందని, సినిమా అంతా అల్లు అర్జున్ షోలా అనిపించిందని అన్నారు. అంతేకాదు సినిమా అంతా తనే చేసేస్తుంటాడని, కథ ఏమీ లేదని చెప్పారు. మరి మోహన్‌కృష్ణ మాటల్ని ఎవరెలా తీసుకుంటారో చూడాలి.