తెలుగు, తమిళ భాషలకు చెందిన స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడానికి తెగ ఇబ్బందిపడిపోతున్న తరుణంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఏడాదికి కనీసం మూడు సినిమాలు చేస్తూ తన అభిమానులను విశేషంగా అలరిస్తున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం “లూసిఫర్” నిన్న విడుదలైంది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మరో మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించడం విశేషం.
రాజకీయాల నేపధ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో వివేక్ ఒబెరాయ్ ప్రతినాయక పాత్ర పోషించగా.. మంజు వారియర్ కథానాయికగా నటించింది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోయినప్పుడు.. ఆయన కుటుంబం సభ్యులు ఆ రాజకీయ కుట్రలో ఎలా ఇరుక్కొన్నారు, కొన్ని దుష్టశక్తులు ఆ కుటుంబానికి చెడు చేయడానికి ప్రయత్నించగా ఓ పవర్ ఫుల్ పర్సన్ ఆ దుష్ట శక్తిని ఎలా అంతం చేశాడు అనేది సినిమా కథాంశం. లెక్కలేనన్ని ట్విస్టులతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసినా చక్కగా ఆడుతుంది. మరి ఏ నిర్మాత ఈ మలయాళ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేస్తాడో తెలియదు కానీ.. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మల్టీస్టారర్ ప్రేక్షకుల్ని అలరించడం మాత్రం ఖాయం.