మళయాళంలోనే కాకుండా తెలుగులో కూడా మోహన్ లాల్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ‘మనమంతా’ ‘జనతా గ్యారేజ్’ ‘మన్యం పులి’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడనే చెప్పాలి. ఎప్పుడూ విభిన్నమైన కథా బలం ఉన్న చిత్రాలనే ఎంచుకుంటూ తనదైన ముద్ర వేసుకుంటున్నాడు. ఇటీవల వచ్చిన ‘ఒడియన్’ చిత్రం ఆశించిన ఫలితాన్ని సాధించక పోయినప్పటికీ మోహన్ లాల్ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.
గతంలో మోహన్ లాల్ ముఖ్య పాత్రలో ‘మహాభారతం’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వాసుదేవన్ నాయర్ రచించిన ఒక గ్రంధాన్ని ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించారు. ప్రముఖ మలయాళ దర్శకుడు శ్రీకుమార్ మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించ బోతున్నాడని.. దాదాపు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి బీఆర్ శెట్టి రెడీ అయినప్పటికీ… కొన్ని కారణాలుగా ఆలస్యమవుతుందని చెప్పుకొచ్చారు. ఇక పలు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని కూడా భావించారు. అయితే ఈ విషయం గురించి తాజాగా మోహన్ లాల్ స్పందించాడు. ‘ఒడియన్’ ప్రమోషన్లలో భాగంగా మోహన్ లాల్ కు ఎదురైన ఈ ప్రశ్నకి స్పందిస్తూ… రచయితకి .. దర్శకుడికి మధ్య తలెత్తిన మనస్పర్థల చోటు చేసుకోవడంతో ఈ ప్రాజెక్టు లేట్ అయ్యిందని, వీరిరువురి మధ్యా అపార్థాలు తొలిగిపోయిన వెంటనే ఈ ప్రాజెక్టు మొదలవుతుందని చెప్పుకొచ్చాడు.