ప్రముఖ కథానాయకుడు రవితేజకు చాలా ఏళ్ల క్రితం ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ఓ బిరుదు ఇచ్చారు. అప్పటి నుండి ఇప్పటివరకు రవితేజ అదే బిరుదుతో కంటిన్యూ అవుతున్నారు. ఆయన ఓకే చేసే కథలు, చేసే సినిమాలు, పాత్రలకు ఆ బిరుదు పర్‌ఫెక్ట్‌గా సూట్ అవ్వడంతో ఆయన అభిమానులు కూడా అదే బిరుదుకు అలవాటుపడ్డారు. కానీ సంక్రాంతికి రావాల్సిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా టైటిల్స్‌లో రవితేజ పేరు పక్కన లేదంటే పైనో ఆ బిరుదు కనిపించదు. ఎందుకు తీసేశారు అనుకోకండి.. ఎందుకంటే తీసేసింది ఆయనే.
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా టీమ్ శనివారం సాయంత్రం ఓ ప్రెస్ మీట్ పెట్టింది. రీసెంట్ ట్రెండ్‌కి అనుగుణంగా ఈ మీట్‌కి హీరో రవితేజ రాలేదు. హీరోయిన్లు, దర్శకనిర్మాతలు అయితే వచ్చారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మరోసారి ఘనంగా ప్రకటించారు. అప్పుడే రవితేజ బిరుదు గురించి, అలాగే ఆయన రెమ్యూనరేషన్ తీసుకోకపోవడం గురించి చెప్పుకొచ్చారు దర్శకనిర్మాతలు.

రవితేజతో ‘పవర్’ సినిమా కోసం పనిచేశా. ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమా కథను రవితేజకు కూడా చెప్పా. డేట్స్ కుదరకపోవడం వల్ల చేయలేకపోయాం. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఓ రోజు రవితేజ వచ్చి.. ‘ఈ సినిమా వరకు టైటిల్స్‌లో మాస్ మహారాజ్ వద్దు కిషోర్. కేవలం రవితేజ అని వేద్దాం’ అన్నారు. దాంతో అలానే టైటిల్స్ వేస్తున్నాం అని చెప్పారు. సినిమా కథ, నేపథ్యం ప్రకారం మాస్ మహారాజ వద్దనుకున్నారు అని అర్థమవుతోంది.
ఇక నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ ఈ సినిమా ఒప్పుకునే సమయంలోనే సినిమాను సంక్రాంతికి రావాలని రవితేజ చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా కోసం పని చేశాం. ఇప్పుడు సంక్రాంతి సీజన్‌లోనే రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు. ఇక ఈ సినిమా కోసం ఇప్పటివరకూ రవితేజ రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని చెప్పారు. టికెట్ రేట్ల సంగతేంటి అని అడిగితే.. ప్రభుత్వం చెప్పే రేట్ల ప్రకారమే టికెట్ ధరలు ఉంటాయని తేల్చేశారు.
