‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రం ప్రమోషన్లలో భాగంగా హీరో విశ్వక్ సేన్ అండ్ టీం చేయించిన ప్రాంక్ వీడియో … నడిరోడ్డు పై పబ్లిక్‌ను ఇబ్బంది పెట్టేలా ఉందని అడ్వాకేట్ అరుణ్ కుమార్ తెలంగాణ మానవహక్కుల కమీషన్‌కు కంప్లైంట్ ఇచ్చాడు. దీనిపై ఓ న్యూస్ ఛానెల్ వారు డిబేట్ నిర్వహించడం.. అక్కడికి వచ్చిన విశ్వక్ సేన్ ను ‘డిప్రెస్డ్ పర్సన్ , పాగల్ సేన్’ అంటూ యాంకర్ దేవి నాగవల్లి కామెంట్స్ చేయడం… దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం సంభవించడం..
దీంతో యాంకర్ నాగవల్లి ‘గెటవుట్ ఆఫ్ మే స్టూడియో’ అంటూ విశ్వక్ సేన్ పై నోరు పారేసుకోవడం… ఆ తర్వాత విశ్వక్ సేన్ తాను వాడిన ‘F..’ అనే పదాన్ని వాడడంతో సారీ చెప్పాడు కానీ మిగిలిన విషయంలో తప్పేమి లేదు అంటూ సమర్ధించుకోవడం.. వంటివి ఇప్పటివరకు మనం చూసాం. మొదట ఇది కూడా స్క్రిప్టెడ్ అని అంతా అనుకున్నారు కానీ.. తర్వాత ఇది నిజమే అని తేలింది. చాలా మంది నెటిజన్లు దేవి నాగవల్లిని ఓ రేంజ్లో ట్రోల్ చేశారు.
ఆమెని తీవ్రంగా విమర్శిస్తూ ఆమె జాబ్ ను కూడా తీసెయ్యాలి అంటూ కామెంట్లు చేసే వాళ్ళ సంఖ్య కూడా ఉంది. ఇదిలా ఉండగా.. యాంకర్ దేవి నాగవల్లి ఈరోజు హీరో విశ్వక్ సేన్‌పై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అయ్యింది. ‘తనని తీవ్రంగా దుర్భాషలాడారని, లైవ్‌లో అసభ్య పదజాలంతో దూషించడాన్ని ఆమె ఖండిస్తూ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. దేవికి మద్దతు ఇచ్చే యాంకర్ల సంఖ్య కూడా ఉంది.
ఈ విషయం పై తలసాని స్పందిస్తూ… “ఈ విషయాన్ని క్లుప్తంగా పరిశీలించి సానుకూలమైన నిర్ణయం తీసుకుంటాం. ఓ సినిమా ప్రమోషన్స్ నిర్వహించుకోవాలనుకుంటే తగిన అనుమతులు తీసుకోవాలి. ప్రాంక్ వీడియోల పేరిట రోడ్లపై ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు, దీనిపై పోలీసు అధికారులతో మాట్లాడతాను.లైవ్ డిబేట్ ను నేను కూడా చూశాను. ఇలాంటి ప్రవర్తనను మా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. మన కుటుంబాల్లో ఆడవాళ్లు ఉంటారు, ఓ ఆడకూతుర్ని ఈ విధంగా అవమానించడం సబబు కాదు.
ఈ అంశంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫు నుంచి తీసుకోవాల్సిన చర్యలు, పోలీసు శాఖ నుంచి తీసుకోవాల్సిన చర్యల పై అధికారులతో మాట్లాడతాను” అంటూ తలసాని చెప్పుకొచ్చారు.