చిన్న, పెద్ద అనే కాదు ఈమధ్యకాలంలో విడుదలవుతున్న ప్రతి సినిమా ఎదుర్కొంటున్న సమస్యే ఇది. సినిమా విడుదలైన మొదటి రెండు మూడు రోజులు సోషల్ మీడియా లేదా వెబ్ సైట్లలో చూస్తేనేమో సినిమా బ్లాక్ బస్టర్ అని, సూపర్ హిట్ అని టాక్ వినిపిస్తోంది. థియేటర్ల వద్ద మాత్రం జనాలు ఉండడం లేదు, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఉండడం లేదు. అందుకు నిదర్శనం సెప్టెంబర్ లో విడుదలైన సినిమాలే. “కేరాఫ్ కంచెరపాలెం, యు టర్న్, శైలజారెడ్డి అల్లుడు” సినిమాలు విడుదలైనప్పుడు సోషల్ మీడియాలో భీభత్సమైన టాక్.. కానీ సినిమాలు మాత్రం యావరేజ్ గా కూడా నిలవలేకపోయాయి.
ఇక రీసెంట్ గా విడుదలైన “నన్ను దోచుకుందువటే, దేవదాస్, నవాబ్” చిత్రాల పరిస్థితి కూడా అంతే. సెప్టెంబర్ లో విడుదలైన ఈ సినిమాలన్నీ సోషల్ మీడియా వరకు సూపర్ హిట్స్ అనే చెప్పుకోవాలి కానీ.. థియేటర్స్ & బాస్కాఫీస్ వద్ద మాత్రం కనీస స్థాయి విజయాల్ని కూడా నమోదు చేయలేకపోయాయి. ఇందుకు కారణం ఏంటనేది ఇంకా ఎవరికీ తెలియకపోయినప్పటికీ.. డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం ఏ సినిమా సోషల్ మీడియా హిట్, ఏ సినిమా బాక్సాఫీస్ హిట్ అనేది విషయంలో కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతున్నారు.