యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా తన అదృష్టాన్ని మరోసారి “మోగ్లీ 2025”తో పరీక్షించుకుంటున్నాడు. “కలర్ ఫోటో” ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ముఖ్యంగా “అఖండ” కారణంగా రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడం అనేది ఈ సినిమాకి మంచి పబ్లిసిటీ తీసుకొచ్చింది. మరి సినిమా ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది? రోషన్ హీరోగా, సందీప్ రాజ్ దర్శకుడిగా నిలదొక్కుకోగలిగారా? అనేది చూద్దాం..!!

కథ: చిన్నప్పుడే తల్లిదండ్రులను దూరం చేసుకొని అనాథగా ఓ ఏజెన్సీ ప్రాంతంలో పెరుగుతాడు మురళీ అలియాస్ మోగ్లీ (రోషన్ కనకాల). చుట్టూ గ్రామాల వారినే తన సొంత మనుషులుగా చూసుకుంటూ ఉంటాడు. ఒక సినిమా షూటింగ్ లో పరిచయమైన అమ్మాయి (సాక్షి)నీ తొలిచూపులోనే ఇష్టపడతాడు.
అదే అమ్మాయిని లోకల్ ఎస్సై కిస్టోఫర్ నోలన్ (బండి సరోజ్ కుమార్) కూడా కోరుకుంటాడు.
ప్రేమకి, కామానికి మధ్య జరిగే పోరాటంలో ఎవరు గెలిచారు? నోలన్ లాంటి షేర్ ఖాన్ ను మోగ్లీ ఎలా ఎదుర్కొన్నాడు? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: బండి సరోజ్ కుమార్ తనదైన శైలి నటనతో వెండితెరను ఆక్రమించేశాడు. అతడు కనిపించే సన్నివేశాలు ఆడియన్స్ భలే ఎంజాయ్ చేస్తారు. అతడి మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ పతాక స్థాయిలో ఉన్నాయి.
రోషన్ కనకాల స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది కానీ.. ఇంకాస్త ఈజ్ అవసరం. మరీ బిగుసుకుపోతున్నట్లుగా ఉన్నాడు. యాక్షన్ సీన్స్ లో అలా ఉన్నా పర్లేదు కానీ.. మిగతా సన్నివేశాల్లో రిలేటబుల్ యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
సాక్షి అందంగా కనిపించింది. కానీ ఆమెకు నటించే స్కోప్ ఎక్కువ దొరకలేదు.
వైవా హర్ష కొన్ని సన్నివేశాల్లో నవ్విస్తాడు, కొన్నిచోట్ల ఏడిపిస్తాడు, ఇంకొన్నిచోట్ల ఆశ్చర్యపరిస్తాడు. అసలు వైవా హర్షకి ఇచ్చిన మాస్ ఎలివేషన్స్ కి ఆడియన్స్ అవాక్కవ్వడం ఖాయం.
భార్గవ్ కి మంచి పాత్ర లభించింది. మంచి వేరియేషన్స్ ప్రదర్శించి నటుడిగా తన సత్తా చాటుకున్నాడు.

సాంకేతికవర్గం పనితీరు: రమా మారుతి సినిమాటోగ్రఫీ వర్క్ ఈ సినిమాకి మెయిన్ ఎసెట్. అతడి ఫ్రేమింగ్స్, లైటింగ్ & కలరింగ్ విషయంలో తీసుకున్న కేర్ ను కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. సందీప్ రాజ్ చెప్పినట్లు ఖర్చు అనేది తెరపై కనిపిస్తుంది.
కాలభైరవ పాటలు వినసొంపుగా, అర్థవంతంగా ఉన్నాయి. అయితే నేపథ్య సంగీతం విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్ కి ఇంకాస్త ఎలివేషన్ అవసరం.
సౌండ్ ఎఫెక్ట్స్ & గ్రాఫిక్స్ పేలవంగా ఉన్నాయి. సినిమాలో చాలా కీలకమైన ఇంటర్వెల్ బ్లాక్ లో అసలు ఎస్.ఎఫ్.ఎక్స్ అనేది లేకపోవడం, అలాగే సినిమాలో చాలా ఇంపార్టెంట్ సీక్వెన్సులు అయినా పాము గ్రాఫిక్స్ తేలిపోవడం అనేది మైనస్ గా మారింది.
ఇక దర్శకుడు సందీప్ రాజ్.. అందరికీ తెలిసిన సాధారణ కథను, కొత్తగా చెప్పాలనే తపనతో ఇరికించిన కర్మ సిద్ధాంతం మరియు డివోషనల్ యాంగిల్ అనేది సినిమాలో సరిగా కూర్చోలేదు. అందువల్ల వాటి కారణంగా వచ్చే జస్టిఫికేషన్ కూడా లాజికల్ గా ఉండదు.
కాకపోతే.. రచయితగా మాత్రం మంచి హాస్యంతో, ఎమోషనల్ కనెక్టివిటీతో అలరించాడు. ముఖ్యంగా 13 సైజ్ బూట్ల కథ హృద్యంగా ఉంది. కొన్ని కామెడీ పంచులు బాగా పేలాయి. ముఖ్యంగా తనమీద తానే వేసుకున్న సెటైర్ కూడా గట్టిగానే పేలింది. ఓవరాల్ గా.. దర్శకుడిగా మెప్పించలేకపోయినా, రచయితగా అలరించాడు సందీప్ రాజ్.

విశ్లేషణ: పాత కథను కొత్తగా చెప్పాలనుకోవడం మంచి ఆలోచనే. అయితే.. ఆ కొత్తదనం అనేది దేనివల్ల వస్తుంది? ఆ కొత్తదనాన్ని ప్రేక్షకులు ఎలా తీసుకుంటారు? అనేది చాలా జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలి. ఆలోచన పరంగా కొన్ని సీక్వెన్సులు కొత్తగా ఉన్నాయి. అయితే.. వాటి ఎగ్జిక్యూషన్ అనేది ఇంకా చాలా బాగా ఉండొచ్చు. డ్రోన్ ఫైట్ ఆలోచన బాగుంది కానీ.. తెరపై దాన్ని చూసినప్పుడు అంత ఎగ్జైట్ చేయలేకపోయింది. అలాంటివి సినిమాలో చాలా అంశాలున్నాయి. అయితే.. బండి సరోజ్ స్క్రీన్ ప్రెజన్స్ కోసం, రమా మారుతి సినిమాటోగ్రఫీ వర్క్ కోసం, వైవా హర్ష క్యారెక్టర్ తో పండించే జోకులు మరియు ఎమోషన్ కోసం ఈ చిత్రాన్ని ఓసారి చూడవచ్చు.

ఫోకస్ పాయింట్: సెకండ్ సినిమా సిండ్రోమ్ ఎఫెక్ట్!
రేటింగ్: 2/5
