సత్యదేవ్, బ్రహ్మానందం, అలీ, ఆర్.సి.ఎం రాజు తదితరులు.. (Cast)
బ్యారీ జెన్కిన్స్ (Director)
అడెల్ రోమాన్స్కి - మార్క్ సెర్యాక్ (Producer)
డేవ్ మెట్జిన్ - నికోలస్ బ్రిటెల్ (Music)
జేమ్స్ లాక్స్టన్ (Cinematography)
Release Date : డిసెంబర్ 20, 2024
వాల్ట్ డిస్నీ సంస్థ నిర్మించిన తాజా యానిమేటెడ్ ఫిలిం “ముఫాసా ది లయన్ కింగ్”. 2019లో విడుదలైన “ది లయన్ కింగ్”కు ప్రీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ లో ముఫాసా పాత్రకు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడంతో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ది లయన్ కింగ్ కు నాని డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈవారం (డిసెంబర్ 20) తెలుగులో “బచ్చలమల్లి”, తమిళంలో “విడుదల 2”, కన్నడలో “యుఐ” వంటి సినిమాలతో సమానమైన క్రేజ్ సంపాదించుకొని థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రంపై మన తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించింది అనేది చూద్దాం..!!
Mufasa The Lion King Review:
కథ: “ది లయన్ కింగ్” చిత్రం సింబ కథతో మొదలవ్వగా.. “ముఫాసా” కథ సింబ తండ్రి ముఫాసా కథతో మొదలవుతుంది. అసలు ముఫాసా ఎవరు? ఎక్కడి నుండి వచ్చాడు? తన తల్లిదండ్రులకు దూరమయ్యి.. అనాథగా వేరే తెగ సింహాల చెంత పెరిగి.. ఒక రాజుగా ఎలా ఎదిగాడు? ఈ క్రమంలో తనకంటే బలవంతుడైన కిరోస్ ను ఎలా ఎదిరించాడు? అందుకు టాకా సహాయపడ్డాడా? చివరికి వీళ్ళందరూ మిలేలేకి ఎలా చేరుకున్నారు? వీళ్లందరినీ రఫీకి ఎలా ఏకం చేశాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “ముఫాసా” చిత్రం.
నటీనటుల పనితీరు: ఇది లైవ్ యానిమేషన్ చిత్రం. చాలా సహజంగా కనిపించే యానిమేషన్ క్వాలిటీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. నిజానికి డబ్బింగ్ గురించి సాంకేతిక వర్గం పనితీరులో ప్రస్తావించాలి కానీ.. ఈ సినిమాకి డబ్బింగ్ ఆర్టిస్టులు కీలకం కాబట్టి.. ఇక్కడే వారి పనితనం గురించి మాట్లాడుకుందాం. మహేష్ బాబు డబ్బింగ్ లో గుంటూరు కారం యాస వినిపిస్తుంది. అయితే.. ముఫాసా పాత్ర తాలూకు ఎమోషన్ ను మ్యాచ్ చేస్తూ వాయిస్ మాడ్యులేషన్ ను మైంటైన్ చేసిన తీరు బాగుంది. అందువల్ల.. ఆ క్యారెక్టర్ స్ట్రగుల్ & పెయిన్ ను ఆడియన్స్ ఓన్ చేసుకుంటారు.
ఇక బ్రహ్మానందం చెప్పిన డబ్బింగ్ పుంబాకు భలే సెట్ అయ్యింది, ఆయనని కాంబినేషన్ లో అలీ టిమాన్ కు చెప్పిన డబ్బింగ్ కూడా బాగా సింక్ అయ్యింది. పిట్ట గొంతుకు షేకింగ్ శేషు వాయిస్ కామెడీ కూడా బాగుంది. ఇక టాకా క్యారెక్టర్ కు సత్యదేవ్ గొంతు, వైట్ లయన్ రోల్ కి అయ్యప్ప శర్మ వాయిస్, రఫీకి క్యారెక్టర్ కి ఆర్.సి.ఎం రాజు వాయిస్ లు బాగా కుదిరాయి.
సాంకేతికవర్గం పనితీరు: తెలుగు అనువాదం కారణంగా పాటల్లో సాహిత్యం సింక్ అవ్వలేక ఇబ్బందిపడింది. పాటలు పాడించిన విధానం కూడా ఆకట్టుకోలేదు. డబ్బింగ్ వెర్షన్ డైలాగ్స్ మాత్రం బాగా పేలాయి. ముఖ్యంగా.. మహేష్, బ్రహ్మానందం & అలీ పాత్రల డైలాగ్స్ భలే కుదిరాయి. ఆ విషయంలో డబ్బింగ్ వెర్షన్ రైటర్స్ ను మెచ్చుకొని తీరాలి. ఇక మిగతా టెక్నికాలిటీస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా.. ఆండర్ వాటర్ ఎపిసోడ్స్ అద్భుతంగా కంపోజ్ చేశారు.
ఈమధ్యకాలంలో పిక్సర్ & వాల్ట్ డిస్నీ నీతి కథలను యానిమేటెడ్ చిత్రాల రూపంలో ప్రెజెంట్ జనరేషన్ కు అందిస్తున్న విధానం ప్రశంసనీయం. ఒక్కో సినిమాతో ఒక్కో విషయాన్ని పిల్లలు, పెద్దలు అర్థం చేసుకునే రీతిలో చెబుతున్నారు. ఆ కారణంగా.. యానిమేటెడ్ సినిమాలు పిల్లలతోపాటు పెద్దలను కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ తరం పిల్లలకు, ప్రస్తుతం తరం పెద్దలకు ఆరోగ్యకరమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చే చిత్రం “ముఫాసా ది లయన్ కింగ్”. ఇందుకు దర్శకుడు బ్యారీ జెన్కిన్స్ & టీమ్ ను అభినందించి తీరాలి.
విశ్లేషణ: ఎప్పుడో 2028 (?)లో వచ్చే రాజమౌళి సినిమా వరకు మహేష్ అభిమానులకు బోర్ కొట్టనివ్వకుండా చేసే సినిమా “ముఫాసా”. అత్యద్భుతమైన లైవ్ యాక్షన్ యానిమేషన్ & మంచి నీతి కథ కోసం ఈ చిత్రాన్ని థియేటర్లలో కచ్చితంగా చూడాల్సిందే. ముఖ్యంగా 3D లేదా 4DXలో చూస్తే ఈ చిత్రాన్ని మరింతగా ఆస్వాదించవచ్చు.
ఫోకస్ పాయింట్: మహేష్ బాబు వాయిస్ తో మహాబాగా ఎలివేటైన ముఫాసా!
రేటింగ్: 3.5/5
Rating
3.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus