దేశంలో రోడ్లు, బిల్డింగ్‌లు కంటే వేగంగా దెబ్బతినేవి ఏమన్నా ఉన్నాయా అంటే అవి మనోభావాలే. ఈ మాట మేం అనడం లేదు. మొన్నీమధ్య ఓ సినిమాలో ఓ పాత్రధారి చెప్పారు. ఆ రైటర్ ఎవరో కానీ.. అయన మనోభావాల విషయంలో బాగా మనోభావాలు దెబ్బతిన్నట్లున్నాయి. అలా దేశంలో తాజాగా మనోభావాలు దెబ్బతిన్న సినిమా విషయం ‘పఠాన్’ సినిమాలోని ‘భేషరమ్ రంగ్’ పాట. ఈ విషయంలో దేశవ్యాప్తంగా చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో దుస్తులు బాగోలేవని, రంగు అభ్యంతరకరంగా ఉందని విమర్శలు వస్తున్నాయి.
ఈ విషయంలో సినిమా విడుదలయ్యాక చూసుకుందాం అని కొందరు అంటుంటే, అసలు సినిమానే విడుదల చేయకూడదు అంటూ ఇంకొంతమంది అన్నారు. అయితే ఈ సినిమా సెన్సార్ కోసం వెళ్తే.. అక్కడ చిన్న అడ్డు తగిలింది. సినిమాలో కొన్ని సీన్స్ విషయంలో మార్పులు చేసుకొస్తే.. అప్పుడు సెన్సార్ చేస్తామని టీమ్ చెప్పిందని టాక్. దీంతో మనోభావాలు బ్యాచ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ‘చూశారా మేం చెప్పాం కదా’ అంటూ మొదలుపెట్టారు. తాజాగా ఇండియన్ ‘శక్తిమాన్’, మాజీ సీబీఎఫ్‌సీ చీఫ్ ముఖేశ్ ఖన్నా స్పందించారు.
వివాదాస్పదంగా మారిన ‘బేషరమ్ రంగ్’ సాంగ్‌పై బాలీవుడ్ నటుడు ముకేశ్ ఖన్నా మరోసారి స్పందించారు. ఆ పాటలో కథానాయిక ధరించిన స్విమ్ సూట్ మత విశ్వాసాలను దెబ్బతీసిందన్న ఆయన దానిపై కఠిన చర్యలు తీసుకోవాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)ని కోరారు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా తెరకెక్కిన ‘పఠాన్’ సినిమాలోని పాట ఇది. సినిమా సన్నివేశాలు, సాంగ్స్‌లో కొన్ని విజువల్స్‌పై సెన్సార్ బోర్డు ఇటీవల అభ్యంతరాలు వ్యక్తం చేసిందని సమాచారం. వాటిని తొలగించాలని సూచించిన బోర్డు.. మార్పులు చేసిన తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ కోసం రావాలని ఆదేశించిందట.
‘‘బేషరమ్ రంగ్’ పాటలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని ‘పఠాన్’ చిత్ర బృందానికి సీబీఎఫ్‌సీ సూచించిందని విన్నాను. ఈ విషయంలో సెన్సార్ బోర్డు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా. లిరిక్స్ మార్చాలని సెన్సార్ బోర్డు చెబితే సరిపోదు, అభ్యంతరకరమైన సన్నివేశాలనూ మార్పించాలని కోరుతున్నాను. అప్పుడు ఏ నిర్మాతా భవిష్యత్తులో ఇలాంటి పాటలు, సీన్స్ తీయడానికి ధైర్యం చేయడు. ఒకవేళ అలాంటి సీన్స్ చేస్తే వారే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని వారికి తెలియాలి అని అన్నారు.