ఎన్నో అంచనాలు, ఇంకెన్నో ఆశలతో రూపొందుతున్న చిత్రం ‘ఆది పురుష్’. అదేంటి ప్రతి సినిమా ఇలానే ఉంటుంది కదా అంటారా? ఇలానే ఉంటుంది. కానీ ‘ఆదిపురుష్’ మీద ఉన్న అంచనాలు డిఫరెంట్. రామాయణం నేపథ్యంలో ఓ సినిమా తీసుకొస్తున్నాం, నేటితరానికి ఇది అవసరం అని టీమ్ చెబితే, ప్రభాస్‌కు సరైన విజయం కావాలి అని మరికొందరు అంటే, సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్ ఇంకో రీజన్. అయితే ఇంత అంచనాలు, లెక్కల మధ్య వచ్చిన సినిమా టీజర్ నవ్వులపాలైంది అని చెప్పొచ్చు.
ఇప్పుడు చాలామందితో టీమ్ మాటలు పడుతోంది. తాజాగా ‘శక్తిమాన్’ ముఖేష్ కన్నా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతిహాసగాథ రామాయణాన్ని ‘ఆదిపురుష్’ తరహాఓ తీస్తే కుదరదని ‘శక్తిమాన్’ పాత్రధారి ముఖేష్ ఖన్నా గట్టిగానే చెబుతున్నారు. తాజాగా ‘ఆది పురుష్’ టీజర్ చూసిన ముఖేష్‌ఖన్నా ఘాటుగా స్పందించారు ‘రాముడు రాముడిలా, హనుమాన్ హనుమంతుడిలా కనిపించడం లేదు. దేవుళ్లు ఎవరూ ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగర్‌లా ఉండరు. కావాలంటే పాత సినిమాల్లో రాముడు, కృష్ణుడిని చూడండి. వాళ్లేమీ బాడీ బిల్డర్స్ కాదు.
వాళ్ల ముఖాలు సున్నితంగా, ఎంతో విధేయతతో ఉంటాయి. కోమలమైన సౌందర్యం ఉంటుంది. అంతే తప్ప గడ్డాలు, మీసాలు ఉండవు’’ అని అన్నారు ముఖేష్ ఖన్నా. సినిమాకు ‘ఆదిపురుష్’ అని పేరు పెట్టి రాతియుగపు మనిషి స్టోరీ చెబితే బాగుండేది. కానీ, రామాయణాన్ని ఎంచుకున్నారు. అలాంటప్పుడు ఈ సినిమా చేయాలనుకుంటే పాత్రలు, వాటి ఆహార్యం ఇలా ఉండకూడదు. ప్రేక్షకుల విశ్వాసాలతో మీరు ఆటలాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖేష్ ఖన్నా.
రూ.వెయ్యి కోట్లు పెట్టి వీఎఫ్‌ఎక్స్‌తో రామాయణాన్ని ఇలా చూపిస్తామంటే సరికాదు.‘అవతార్’ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని, పాత్రలను తీర్చిదిద్దటం సరైన పద్ధతి కాదు అని కూడా అన్నారు. ‘‘రామాయణ పాత్రలతో వినోదాన్ని పంచాలనుకుంటే ప్రజల ఆగ్రహానికి మీరు గురవుతారు. ‘ఆదిపురుష్’ను ఫిక్షనల్ స్టోరీ అని చెప్పండి.. అంతేకానీ దయచేసి రామాయణం అని చెప్పకండి. సంప్రదాయాలు, మత విశ్వాసాలు, ఇతిహాసాలను మార్చడానికి డబ్బులు వృథా చేయకండి’’ అని అంటూ ముఖేష్ ఖన్నా మండిపడ్డారు.