మొన్నీ మధ్య ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ సూపర్ స్టార్ ఓ మాట అన్నారు గుర్తుందా. సౌత్‌లో హీరోలు మల్టీస్టారర్‌లకు, వేరే హీరోలతో నటించడానికి ముందుకొస్తారు. మన దగ్గర ఇలాంటివి తక్కువ అని. ఈ మాటకు క్లియర్‌గా అర్థం తెలియాలంటే దివంగత కృష్ణంరాజును చూడాల్సిందే. ఎందుకంటే తన సుదీర్ఘ 55 ఏళ్ల కెరీర్‌లో ఆయన ఇతర హీరోలతో చాలాసార్లు తెరను పంచుకున్నారు. మంచి పాత్ర అంటే చాలు.. వేరే మాట లేకుండా ఠక్కున ఓకే చెప్పేసి, నటించేసేవారు.
టాలీవుడ్‌లో ఇప్పటికీ కొంతమంది హీరోలు తమ చిత్రంలో మరో హీరో కనిపిస్తాడన్నా, ఇతర హీరోల సినిమాలో చిన్న పాత్ర పోషించాలన్నా భయపడుతుంటారు. అలా మల్టీస్టారర్, లేదంటే ఇంకో హీరో ఉన్న సినిమాలో నటిస్తే ఏమవుతుందో? అనుకుంటారు. ఇలా నటిస్తే ఏం జరుగుతుందో? ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది? అంటూ లెక్కలేసుకుంటుంటారు. కానీ కృష్ణంరాజు దీనికి పూర్తిగా భిన్నం. ఎందుకంటే ఆయన 180 సినిమాలకుపైగా నటిస్తే… అందులో 40కిపైగా ఇతర నటులతో కలిసి నటించినవే కావడం గమనార్హం.
తన తరం వారితోనే కాకుండా, ఈతరం తారలతోనూ చాలాసార్లు స్క్రీన్ షేర్ చేసుకున్నారు కృష్ణంరాజు. ప్రభాస్‌తో కలసి ‘బిల్లా’, ‘రెబల్’, ‘రాధేశ్యామ్’ చిత్రాల్లో కనిపించారు. అయితే అంతకుముందు అంటే స్టార్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో.. చాలా మంది స్టార్ హీరోలతో కలసి నటించారు. కృష్ణతో ‘కురుక్షేత్రం’, ‘ఇంద్ర భవనం’, ‘అడవి సింహాలు’ ‘నేనంటే నేనే’, ‘విశ్వనాథ నాయకుడు’ చేశారు. ఇక అక్కినేని నాగేశ్వరరావుతో ‘జై జవాన్’, ‘ఎస్. పి. భయంకర్’, ‘పవిత్ర బంధం’, ‘బుద్ధిమంతుడు’ సినిమాల్లో నటించారు.
శోభన్‌బాబుతో ‘జీవన తరంగాలు’, ‘మానవుడు దానవుడు’ చేయగా, నందూమరి తారకరామారావుతో ‘సతీ సావిత్రి’, ‘మంచికి మరోపేరు’, ‘మనుషుల్లో దేవుడు’, ‘వాడే వీడు’, ‘బడిపంతులు’ చిత్రాల్లో తెరను పంచుకున్నారు. చిరంజీవితో ‘మనవూరి పాండవులు’, ‘ప్రేమ తరంగాలు’, ‘పులి – బెబ్బులి’లో నటించగా, మోహన్‌బాబుతో ‘అందడు ఆగడు’, ‘రంగూన్ రౌడీ’, ‘తిరుగుబాటు’, ‘ఉగ్రనరసింహం’, ‘సర్దార్ ధర్మన్న’ చిత్రాల్లో కలసి నటించారు. ఇక బాలయ్యతో ‘వంశోద్థారకుడు’, ‘సుల్తాన్’లో నటించారు.
ఆ తర్వాతి తరం నటుల సంగతి చూస్తే శ్రీకాంత్‌తో ‘మా నాన్నకు పెళ్లి’.. రాజశేఖర్‌తో ‘గ్యాంగ్ మాస్టర్’, జగపతిబాబుతో ‘జైలర్‌గారి అబ్బాయి’, ‘సింహస్వప్నం’లో నటించారు. సుమన్‌తో ‘బావ.. బావమరిది’ నటించగా, నాగార్జునతో ‘కిరాయి దాదా’ ‘నేటి సిద్ధార్థ’లో కనిపించారు. ‘గురు శిష్యులు’లో రాజేంద్ర ప్రసాద్‌తో నటించగా, వెంకటేశ్‌తో ‘టూ టౌన్ రౌడీ’ చేశారు. నితిన్‌తో కలసి ‘రామ్’లో కనిపించగా, ‘నీకు నేను నాకు నువ్వు’ సినిమాలో ఉదయ్ కిరణ్‌తో నటించారు. అనుష్క ‘రుద్రమదేవి’లోను, నాని ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లోనూ కృష్ణం రాజు కీలక పాత్రల్లో కనిపించారు.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!