Muthayya Review in Telugu: ముత్తయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సుధాకర్ రెడ్డి (Hero)
  • మౌనిక బొమ్మ (Heroine)
  • అరుణ్ రాజ్, మౌనిక బొమ్మ, పూర్ణచంద్ర, కిరణ్ కుమార్ తదితరులు.. (Cast)
  • భాస్కర్ మౌర్య (Director)
  • హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ - ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ (Producer)
  • కార్తీక్ రోడ్రిగేజ్ (Music)
  • దివాకర్ మణి (Cinematography)
  • Release Date : మే 01, 2025

తెలుగులో హార్ట్ మూవీస్ అంటే.. మనసుకి సంతృప్తినిచ్చే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అటువంటి ఓ అరుదైన చిత్రమే “ముత్తయ్య” (Muthayya). 70 ఏళ్ల వయసులో సినిమాలో నటించాలనే ఓ ముసలోడి ఆశ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. “బలగం” ఫేమ్ సుధాకర్ రెడ్డి టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రానికి భాస్కర్ మౌర్య దర్శకుడు. ఈటీవీ విన్ యాప్ లో నేటి నుండి (మే 01) స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా ఎందుకని మిస్ అవ్వకూడదు అనేది తెలియాలంటే సమీక్ష చదవాల్సిందే..!!

Muthayya Review

కథ: ముత్తయ్య (సుధాకర్ రెడ్డి) భార్య మరణం అనంతరం సొంత కొడుక్కి దూరంగా పొలంలో చిన్న గుడిసెలో జీవిస్తుంటాడు. ఊర్లో తనకంటూ ఉన్న ఏకైక దోస్తు మల్లి (అరుణ్ రాజ్)తో కలిసి సినిమాలు చూడడం, డబ్బులున్నప్పుడు మందు తాగడం, కుదిరినప్పుడు నాటకాలు ఆడడం తప్ప ఇంకేమీ తెలియని ముసలోడు.

అయితే.. చిన్నప్పటినుండి నాటకాలు వేస్తున్నప్పటికీ, ఎప్పటికైనా తనను తాను తెరపై చూసుకోవాలన్నది ముత్తయ్య కల. ఊరు విడిచి వెళ్లలేక, ఊర్లో జరిగే షూటింగ్స్ దగ్గర తచ్చాడుతూ అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటాడు.

ఇంతకీ ముత్తయ్య ఆశ నెరవేరిందా? అందుకోసం అతడు పడిన శ్రమ ఏమిటి? అనేది “ముత్తయ్య” (Muthayya) కథాంశం.

నటీనటుల పనితీరు: సినిమాలో కనిపించే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఎంతో సహజంగా పాత్రల్లో ఒదిగిపోయారు. నాటకాల అనుభవం ఉండడంతో సుధాకర్ రెడ్డి అసలు కెమెరాను పట్టించుకోకుండా ముత్తయ్య అనే పాత్రకు ప్రాణం పెట్టేశాడు. ఆయనలో కనిపించే అలసత్వం, ఆశావాదం చాలా రిలేటబుల్ గా ఉంటాయి. మన ఇంట్లో ఓ తాత ఉన్నా ఇలానే ఉంటారేమో అని భావన కలిగిస్తుంది.

ఇక మల్లి పాత్రలో అరుణ్ రాజ్ కూడా జీవించేశాడు. సుధాకర్ రెడ్డి – అరుణ్ రాజ్ ల కాంబినేషన్ కామెడీ & ఎమోషనల్ సీన్స్ మంచి హాస్యాన్ని, బాంధవ్యాన్ని ఎలివేట్ చేశాయి. ఈ ఇద్దరు కొట్టుకున్నా కూడా అందులోనూ ఓ తెలియని ప్రేమ కనిపిస్తుంది. వీళ్ల కెమిస్ట్రీ సినిమాకి హైలైట్ అని చెప్పాలి.

సాంకేతికవర్గం పనితీరు: దివాకర్ మణి సినిమాటోగ్రఫీ వర్క్ సింపుల్ గా ఉన్నప్పటికీ.. ఈ కథకు కావాల్సిన ఎఫెక్టివ్ నెస్ & ఎమోషన్ ను ఎక్కడా మిస్ అవ్వనివ్వలేదు. ఫ్రేమింగ్స్ కంటే విజువల్ స్టోరీ టెల్లింగ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో.. ఆ ఊర్లో ఆడియన్స్ ను కూర్చోబెట్టి పాత్రలను చూపించినట్లుగా ఉంటుందే తప్ప, ఎక్కడా కూడా ఏదో సినిమా చూస్తున్నాం అనే భావన కానీ, అసహజత్వాన్ని కానీ కనబడనివ్వలేదు.

కార్తీక్ రోడ్రిగేజ్ సంగీతం సింపుల్ గా ఉంది. పాటలు సోసోగా ఉన్నా.. నేపథ్య సంగీతం మాత్రం హృద్యంగా ఉంది. ముఖ్యంగా ముత్తయ్య-మల్లిల మధ్య వచ్చే సందర్బాలను, సన్నివేశాలను నేపథ్య సంగీతంతో ఎలివేట్ చేసిన తీరు బాగుంది.

దర్శకుడు భాస్కర్ మౌర్య ఓ సాదాసీదా కథను, అందరూ కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించి మంచి మార్కులు సంపాదించుకున్నాడు. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఎక్కువ టైమ్ తీసుకోకుండా, ఊర్లోని పరిస్థితుల ద్వారా పాత్రలను పరిచయం చేస్తూ ఎక్కడా కూడా ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్ ఎలివేషన్ కోసమే, ఒక స్పెసిఫిక్ డ్రామా పండించడం కోసం అనవసరమైన సన్నివేశాలు యాడ్ చేయకుండా.. కుదిరినంతలో సహజత్వాన్ని ఒడిసిపట్టి, సినిమాను తెరకెక్కించిన విధానం కచ్చితంగా అలరిస్తుంది. కథకుడిగా, దర్శకుడిగా “ముత్తయ్య” చిత్రంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విజయం సాధించాడు భాస్కర్ మౌర్య.

విశ్లేషణ: ఈమధ్యకాలంలో తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాలంటే తాగుడు, కొట్టుకోవడం, బూతులు తిట్టుకోవడం అన్నట్లుగా ప్రొజెక్ట్ చేశారు చాలామంది దర్శకులు. మధ్యలో వచ్చిన “బలగం, బాపు” లాంటి సినిమాలు ఆ ఇమేజ్ ను కాస్త మార్చాయి. “ముత్తయ్య” కూడా అదే విధంగా తెలంగాణ సినిమా అంటే కేవలం తాగుడు కాదు.. తెలంగాణ ఆత్మ, యాసలో ప్రేమ ఎలా ఉంటుందో రుచి చూపించింది. తనలోని నటుడ్ని వెండితెరపై చూసుకోవాలనుకున్న ఓ వృద్ధుడి కలను ఎంతో సహజంగా, హృద్యంగా తెరపై చూపించిన సినిమా “ముత్తయ్య”. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్ ల నటన, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ వర్క్, కార్తీక్ రోడ్రిగేజ్ నేపథ్య సంగీతం.. వీటన్నిటినీ అత్యద్భుతంగా హ్యాండిల్ చేసిన భాస్కర్ మౌర్య టేకింగ్ కోసం “ముత్తయ్య” చిత్రాన్ని కచ్చితంగా చూడాల్సిందే.

ఫోకస్ పాయింట్: కళను నమ్ముకున్న వాడి కల ఎప్పటికైనా నెరవేరుతుంది!

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus