అప్పుడెప్పుడో ఏడేళ్ల క్రితం “180” అనే సినిమాతో దర్శకుడిగా మారిన సీనియర్ మోస్ట్ యాడ్ ఫిలిం మేకర్ టర్నడ్ డైరెక్టర్ మళ్లీ ఇన్నాళ్ల తర్వాత తెరకెక్కించిన చిత్రం “నా నువ్వే”. కళ్యాణ్ రామ్-తమన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయడం విశేషం. ఫూర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందా? హీరోగా కళ్యాణ్ రామ్ కి మరో హిట్ అందించగలిగిందా లేదా అనేది సమీక్ష చదివి తెలుసుకోండి..!!
కథ : మీరా (తమన్నా) ఓ రేడియో జాకీ.. కలవకుండా కేవలం ఫోటో చూసి వరుణ్ (కళ్యాణ్ రామ్)ను ప్రేమిస్తుంది. ఇద్దరి మధ్య ఏదో డ్రైవింగ్ ఫోర్స్ ఉందని, అదే తమని కలపడానికి ప్రయత్నిస్తోందని నమ్ముతుంది మీరా. డెస్టినీ అనేది ఏదీ లేదని కేవలం మనం ప్లాన్ చేసుకున్నది మాత్రమే జరుగుతుందని నమ్ముతాడు వరుణ్. ఇలా భిన్న మనస్తత్వాలు కలిగిన వరుణ్-మీరాల ప్రేమ చివరకు ఫలించిందా లేదా అనేది “నా నువ్వే” కథాంశం.
నటీనటుల పనితీరు : కళ్యాణ్ రామ్ సరికొత్తగా కనిపించినా.. ఈ చిత్రంలో తమన్నా అందర్నీ డామినేట్ చేసింది. ఆమె నటన, అందం, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ మూమెంట్స్ చాలా బాగున్నప్పటికీ.. వాటి ప్లేస్ మెంట్ సరిగా లేకపోవడంతో తమన్నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది. ఇక కళ్యాణ్ రామ్ చూడ్డానికి సరికొత్తగా కనిపించినా.. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో అలరించాలని ప్రయత్నించాడు కానీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. కాకపోతే బెటర్ అనిపించుకున్నాడు.
వెన్నెల కిషోర్ కామెడీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సింగిల్ లైన్ పంచ్ లు, ప్రాసలు పెద్దగా వర్కవుట్ అవ్వలేదనే చెప్పాలి. కొన్ని సన్నివేశాల రూపకల్పన కానీ.. స్క్రీన్ ప్లే కానీ ప్రేక్షకులకు అస్సలు అర్ధం కాదు. తనికెళ్ళభరణి, పోసాని, సురేఖావాణి, బిత్తిరి సత్తిలు అసలు సినిమాలో ఎందుకు ఉన్నారో, ఆ టైం లో ఎందుకు వచ్చారో వాళ్ళకి కూడా క్లారిటీ ఉండదు.
సాంకేతికవర్గం పనితీరు : శరత్ సంగీతం సినిమా రిలీజ్ కి ముందే అందరికీ నచ్చినప్పటికీ.. సినిమా చూసాక ఆ భావన మొత్తం పోతుంది. పాటల ప్లేస్ మెంట్ కానీ, చిత్రీకరణ కానీ ఏమాత్రం ఆకట్టుకునే విధముగా లేకపోవడం గమనార్హం. అయితే పాపం తమన్నా మాత్రం తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది డ్యాన్స్ పరంగా.
సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకుడి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే.. పి.సి.శ్రీరామ్ లాంటి సీనియర్ మోస్ట్ టెక్నీషియన్ ను పెట్టుకొని పాటలకి సి.జి ఎందుకు చేయించారు? పోనీ ఆ సి.జి వర్క్ అయినా బాగుందా అంటే అదీ లేదు. ముఖ్యంగా.. “ప్రేమికా..” పాటను ఎందుకంత విచిత్రంగా చిత్రీకరించారో దర్శకుడు జయేంద్రగారికే తెలియాలి.
సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ ఏదైనా ఉంది అంటే.. అది స్క్రీన్ ప్లే. ఈ తరహా లవ్ స్టోరీస్ కి ఉండాల్సిన కనెక్టివిటీ కానీ ఫ్లో కానీ లేదు. ఏదో అతుకుల బొంతలా అనిపిస్తుంది సినిమా మొత్తం. ఇక “180” చిత్రానికి పనిచేసిన రైటర్స్ టీమ్ “నా నువ్వే”కి వర్క్ చేయడం. స్క్రీన్ ప్లే విషయంలో అస్సలు జాగ్రత్త వహించకపోవడం సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ గా నిలిచింది.
దర్శకుడు జయేంద్ర సినిమాని కూడా ఏదో యాడ్స్ తీసినట్లుగా తీయడం అనేది సెట్ అవ్వలేదు. ఏదో ఓలా, రేడియో స్టేషన్స్, హాస్పిటల్స్ కి యాడ్ ఫిలిమ్స్ లా ఉన్నాయి కొన్ని సన్నివేశాలు. తమన్నా అందాన్ని, అభినయాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్న జయేంద్ర కళ్యాణ్ రామ్ నుంచి మాత్రం మంచి నటన రాబట్టుకోలేకపోయాడు. ఇక పి.సి.శ్రీరామ్ లాంటి ఫెంటాస్టిక్ సినిమాటోగ్రాఫర్ ని పెట్టుకొని కూడా పాటల్ని సి.జి వర్క్ తో ఎందుకు తెరకెక్కించాడు, కలర్ పేలేట్స్ ను ఎందుకు వినియోగించుకోలేదు? వంటి ప్రశ్నలకి ఆయనే సమాధానం చెప్పాలి. యాడ్ ఫిలిం మేకర్ గా తనకున్న అనుభవంతో కొన్ని సన్నివేశాల్ని పర్లేదు అనే విధంగా తెరకెక్కించినా.. డెస్టినీ కాన్సెప్ట్ ను అర్థవంతంగా డీల్ చేయడంలో, సెకండాఫ్ ను కాస్త ఇంట్రెస్టింగ్ గా నడిపించడంలో దారుణంగా విఫలమయ్యాడు.
విశ్లేషణ : ప్రేమకథలు ఉంటే ఎంటర్ టైనింగ్ గా ఉండాలి లేదంటే మనసుకు హత్తుకొనేలా అయినా ఉండాలి. రెండు రకాలుగా ఉండడానికి ప్రయత్నించి ఎటూ కాకుండా పోయిన చిత్రం “నా నువ్వే”. ఒక్క తమన్నా కోసం తప్ప ఈ సినిమా ప్రత్యేకించి థియేటర్లో రెండు గంటలపాటు కూర్చుని చూడ్డానికి పెద్దగా కారణం లేదు.
రేటింగ్ : 1.5/5