నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు తెరంగేట్రం చేయబోతున్నాడు. బాలకృష్ణ (Balakrishna) తనయుడు మోక్షజ్ఞకి (Nandamuri Mokshagnya) సంబంధించిన తొలి సినిమా ఎప్పటినుంచో ఇండస్ట్రీలో చర్చగా మారింది. బాలయ్య ఎన్నో సార్లు తన కొడుకు సినీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, కానీ ప్రాజెక్ట్ ఆలస్యం అవ్వడం అభిమానులను కొంత నిరుత్సాహానికి గురి చేసింది. మోక్షజ్ఞ మొదటి సినిమాకి దర్శకుడిగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) సెట్టయిన విషయం తెలిసిందే. ఇది సూపర్ హీరో బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే విభిన్నమైన సినిమా అని టాక్.
ముందుగా డిసెంబర్‌లో ప్రారంభం కావాల్సిన ఈ ప్రాజెక్ట్ అనివార్య కారణాలతో వాయిదా పడింది. క్యాన్సిల్ అయినట్లు కూడా రకరకాలుగా కొన్ని గాసిప్స్ వచ్చాయి. కానీ అందులో నిజం లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయితే షూటింగ్ విషయంలో మాత్రం సరైన క్లారిటీ ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వేగంగా జరుగుతుందని, ఫిబ్రవరిలో షూటింగ్ మొదలవుతుందని సమాచారం.
ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri), తేజస్విని నందమూరి సంయుక్తంగా నిర్మించనుండటంతో బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ చేయడం లేదట. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రత్యేకంగా విజువల్ ఎఫెక్ట్స్ పై పెద్ద మొత్తంలో ఖర్చు చేయబోతున్నారని సమాచారం. ఫిబ్రవరి లో హీరో ఇంట్రడక్షన్ కు సంబంధించిన ఒక కీలకమైన సీన్ ను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
అలాగే విలన్ – హీరోకు సంబంధించిన సీన్స్ కూడా ఫస్ట్ షెడ్యూల్ లో షూట్ చేస్తారని టాక్. చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్ పై రకరకాల వార్తలు వస్తున్నాయి. మరి ఈసారైనా నిజమవుతుందో లేదో చూడాలి. ఇక హీరోయిన్ ఎంపిక విషయానికి వస్తే, బాలీవుడ్ స్టార్ రవీనా టాండన్ (Raveeena Tadon) కూతురు రాషా థడానీ పేరు వినిపిస్తోంది. ఈ విషయంపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. సెట్‌లో పని చేయబోయే ఇతర టెక్నీషియన్స్ వివరాలను కూడా త్వరలోనే తెలియజేయనున్నట్లు టాక్.