‘మైనే ప్యార్ కియా’ సినిమాలో భాగ్యశ్రీ అదరగొట్టేసింది. ఇప్పటికే ఆ సినిమాలో సల్మాన్ ఖాన్ – భాగ్యశ్రీ జంటను చూస్తే వావ్ అనిపిస్తుంది. అయితే భాగ్యశ్రీ ప్లేస్‌లో ఉండాల్సింది నదియా అని మీకు తెలుసా? అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఆ సల్మాన్ పక్కన నదియాను చూసేవాళ్లం. ఈ విషయాన్ని నదియానే ఇటీవల చెప్పుకొచ్చారు. తన పెళ్లి వల్ల ‘మైనే ప్యార్ కియా’ వదులుకున్నాను అని చెప్పారు నదియా. ఇంతకీ ఏమైందంటే…
నదియా ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కేరళ నుండి వాళ్ల నాన్న ఫ్రెండ్ ఇంటికొచ్చారట. ఆయన మలయాళీ దర్శకుడు ఫాజిల్‌కి స్వయానా అన్నయ్య అట. ఆ రెండో రోజు ఫాజిల్ నుండి ఫోన్ వచ్చిందట. ‘‘మోహన్‌లాల్‌తో చేస్తున్న సినిమాలో హీరోయిన్ కోసం చూస్తున్నాం. మీ అమ్మాయి ఆ పాత్రకి బాగుంటుంది. ఆడిషన్‌కి తీసుకొస్తారా’’ అని అడిగారట. ‘‘సినిమా రంగం కొత్తగా ఉంటుంది. ప్రయత్నించు చూడు, చేయలేను అనిపిస్తే మరో సినిమా ఒప్పుకోకు’’ అని నదియా వాళ్ల నాన్న చెప్పి కేరళకు తీసుకెళ్లారట.
‘నొక్కేత దూరత్తు కన్నుమ్ నట్టు’ చేశారు నదియా. ఆ సమయంలోనే నదియా అప్పటికే ప్రేమించిన శిరీష్‌కి అమెరికాలో ఉద్యోగ మొచ్చిందట. దాంతో అతను పెద్ద వాళ్లతో మాట్లాడి పెళ్లికి ఒప్పించారట. సరిగ్గా అప్పుడే నదియాకు ‘మైనే ప్యార్ కియా’లో సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం వచ్చిందట. పెళ్లిని వాయిదా వేసి ఆ సినిమా చేద్దామా అనిపించిందట నదియాకు. అయితే ఆ లోపు ఏదన్నా సమస్య వస్తే మొదటికే మోసం వస్తుందని భయపడి ఆ సినిమాకు నో చెప్పారట నదియా.
అలా 1988లో పెళ్లి చేసుకొని, అప్పటికే ఓకే చెప్పిన సినిమాల్ని పూర్తి చేసి కుటుంబం కోసం అమెరికా వెళ్లిపోయారు నదియా. ఒకవేళ ఆ సినిమాలో భాగ్యశ్రీ కాకుండా నదియా చేస్తే ఎలా ఉండేదో ఆలోచించుకుంటేనే వావ్ అనిపిస్తోంది కదా. ఎందుకంటే ఆ సినిమా ఫీల్కి నదియా ఎక్స్ప్రెషన్స్ అయితే అదిరిపోయేవి. భాగ్యశ్రీ బాగా చేయలేదు అని కాదని, నదియా కూడా అదరగొడుతుందని అంతే.