కరోనా – లాక్‌డౌన్ సమయంలో చాలామంది తమకు రాని చాలా విషయాలు నేర్చుకున్నారు. ఎలా జీవించాలి, జీవితం అంటే ఏంటి లాంటి విషయాలు బాగానే తెలిశాయి అని చెబుతుంటారు. సగటు మనిషి కంటే… సెలబ్రిటీలే ఎక్కువ తెలుసుకున్నారు అని అంటుంటారు. ఈ విషయాన్ని చాలామంది సెలబ్రిటీలు చెప్పారు కూడా. అయితే అంత సీరియస్‌గా కాకపోయినా.. ఫన్నీ వేలో చూసుకుంటే తెలియని చాలా విషయాలు నేర్చుకున్నారు. ప్రముఖ నటి నదియా కూడా కరోనా టైమ్‌లో చాలా ఏళ్లుగా కల కంటున్న ఓ విషయాన్ని నేర్చుకున్నారట.
ఇటీవల ఆ విషయాన్ని నదియా వెల్లడించారు. అంత గొప్ప కల ఏంటి అనుకుంటున్నారా? తెలుగు నేర్చుకోవడమే. అవును కరోనా ఇచ్చిన గ్యాప్‌లో తెలుగు నేర్చుకున్నారట. అందుకే ‘అంటే సుందరానికీ’ సినిమాలో డబ్బింగ్ చెప్పగలిగారట. ‘‘తెలుగు నేర్చుకుని స్పష్టంగా మాట్లాడాలనేది నా నా కల. చాలా రోజులగా ఇదే ఆలోచిస్తూ ఉన్నాను. అయితే కరోనా గ్యాప్‌లో నేర్చేసుకున్నా’’ అని చెప్పారు నదియా. తెలుగు నేర్చుకోవాలనే కల వెనుక ఓ కారణముందట. నదియా తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చిన ‘మిర్చి’లో అవకాశం వచ్చినప్పుడు భాష రాకపోవడంతో భయపడ్డారట.
డైలాగులు కరెక్ట్‌గా చెప్పలేకపోతే ముఖంలో హావభావాలు సరిగా పలికించలేం అనేది ఆమె ఆలోచన. అయితే దర్శకుడు ఇచ్చిన సపోర్ట్‌తో నటించగలిగా అని చెప్పారు. అయితే సినిమా చేసేటప్పుడు అంత సంతృప్తి కలగలేదట. లాక్‌డౌన్‌లో తీరిక దొరకడంతో స్పష్టంగా తెలుగు నేర్చుకున్నారట. నదియా తెలుగులో వరుస సినిమాలు చేయడం చూసి.. హీరోయిన్‌గా టాలీవుడ్‌కు చాలా రోజులు దూరంగా ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో టాలీవుడ్‌ను అసలు వదలట్లేదేంటీ అని అడుగుతున్నారట నదియాని.
దానికి నదియా అయితే అదిరిపోయే సమాధానం ఇస్తున్నారట. ‘‘నా లైఫ్ ఇలా ఉండాలి, ఇప్పుడు ఇలా చేయాలి అని ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదు. అలా అన్నీ జరిగిపోతున్నాయంతే’’ అని చెబుతున్నారట నదియా. నా పేరులానే నా జీవితం కూడా మలుపులు తిరుగుతూ పరిగెడుతోంది అని అంటుంటారు నదియా.