విజయనగరం జిల్లాలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి వెళ్లిన నాగబాబు.. అక్కడ ఓ హోటల్లో స్టే చేశారు. పార్టీ పెద్దలతో మాట్లాడిన అనంతరం ఆయన అదే హోటల్ లో మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారా? ఇచ్చే అవకాశం ఉందా? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటికి నాగబాబు బదులిస్తూ.. “అబ్బే… అస్సలు ఛాన్స్ లేదు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి చిరు మద్దతు ఇస్తారు తప్ప.. పోటీ చేసే అవకాశమే లేదు. ఉండదు.
“అంటూ ఆయన ఖచ్చితంగా చెప్పారు. ఇక టీడీపీతో పొత్తు విషయం పై కూడా ఆయన స్పందించారు. రాష్ట్ర భవిష్యత్తు.. గురించి ఆలోచించి ఎలాంటి నిర్ణయమైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే తీసుకుంటారని ఆయన చెప్పుకొచ్చారు. చిరు మాత్రం జనసేనకి ఓటు వేయడం తప్ప రాజకీయాలకు సంబంధించి ఎటువంటి విషయాల్లోకి తలదూర్చకూడదని ఆయన భావిస్తున్నట్లు, వచ్చే ఎన్నికల్లో రాజకీయ పరంగా చిరంజీవి పాత్ర అదొక్కటే అని నాగబాబు తెలిపారు.
2008లో చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టడం.. 2010 లో దానిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. ఆ టైములో చిరు పై ఎన్ని విమర్శలు వెల్లువెత్తాయి అనేది అందరూ చూశారు. కాబట్టి ప్రస్తుతం ఆయన ప్రశాంతంగా సినిమాలు చేసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ‘ఆచార్య’ చిత్రం నిరాశపరిచింది కాబట్టి వీలైనంత త్వరగా ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు.
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ కు ఇది రీమేక్. తెలుగులో కూడా ఈ మూవీ డబ్ అయ్యింది కానీ మెగాస్టార్ ఇమేజ్ కు తగ్గట్టు చాలా మార్పులు చేసి ఈ మూవీని రీమేక్ చేస్తున్నారు దర్శకుడు మోహన్ రాజా.