మొన్నీమధ్యే రూ.6 కోట్ల వరకు లాస్ అయి.. తిరిగి ‘రాజు వెడ్స్ రాంబాయి’తో సెట్ అయిన యువ నిర్మాత బన్ని వాస్ కొత్త సినిమాకు సిద్ధమవుతున్నారట. తన నిర్మాణ భాగస్వామి వంశీ నందిపాటితో కలసి ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పటివరకు ఈ ఇద్దరూ కలసి చిన్న సినిమాలే చేయగా.. తొలిసారి కాస్త స్టార్ స్టేటస్ ఉన్న హీరోతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆయన నాగచైతన్య. అవును చైతు కొత్త సినిమా దాదాపు ఫిక్స్ అయింది అని అంటున్నారు.
నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. ఈ సినిమా తర్వాత చైతన్య చేయబోయే చిత్రం ఇదే అంటున్నారు. ఇక ఈ సినిమాను ‘బెదురులంక’ ఫేమ్స్ క్లాక్స్ అలియాస్ ఉదయ్ రాజు వెంకట కృష్ణ పాండు రంగరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారట. ఇప్పటికే ఈ కథ గురించి చర్చలు జరిగాయట. చైతు కూడా సినిమా మీద ఆసక్తి చూపిస్తున్నాడని టాక్. తొలి సినిమా ‘బెదురులంక 2012’లో కాకుండా వైవిధ్యంగా మాస్ ఎలిమెంట్స్‌తో ఉంటుందని చెబుతున్నారు.

ఇక నాగచైనత్య విషయానికొస్తే.. ‘వృష కర్మ’ సినిమా మీద భారీ అంచనాలే పెట్టేసుకున్నారు. తన కెరీర్‌లో భారీ బడ్జెట్, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. తన కెరీర్‌లో ఇలాంటి సినిమా చేయలేదని.. కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని చైతు సందర్భం కుదరినప్పుడల్లా చెబుతూనే ఉన్నాడు. ఈ సినిమాకు ముందు కార్తిక్ దండు చేసిన ‘విరూపాక్ష’ భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కథ కూడా దానికి రిలేటెడ్‌గా ఉంటుందని చెబుతున్నారు. ‘భమ్ భోలేనాథ్’ సినిమాతో 11 ఏళ్ల క్రితం దర్శకత్వం ప్రారంభించిన కార్తిక్ దండు.. ఆ తర్వాత ఎనిమిదేళ్లకు ‘విరూపాక్ష’ చేశారు. ఇప్పుడు మూడేళ్లకు ‘వృష కర్మ’ రాబోతోంది.
