ఆరేళ్ల క్రితం వచ్చిన సినిమా.. ‘డియర్ కామ్రేడ్’. ఈ సినిమా బయటకు తెలిసినంతవరకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన, మైత్రీ మూవీ మేకర్స్, భరత్ కమ్మకు చాలా స్పెషల్. ఎందుకంటే ఈ సినిమా మీద వారు చాలా నమ్మకం పెట్టుకున్నారు. ప్రాజెక్ట్ పట్టాలెక్కినప్పటి నుండి.. విడుదలయ్యేంత వరకు చాలా కష్టపడ్డారు. ఎంతగా ప్రేమించారంటే ఆ సినిమాను.. ఆస్కార్‌కి పంపడానికి ఇండియన్ కమిటీ ముందు స్క్రీనింగ్ కూడా చేశారు. దీని కోసం ముంబయిలో భారీ ఎత్తున ప్రచారం కూడా చేశారు.
ఈ పని చేయడం వల్ల ఆ సినిమా మీద ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌కి అభిమానం ఉందని తెలిసింది. అయితే ఆస్కార్ అవకాశం రాలేదు అనుకోండి. కానీ ఇప్పుడు జరుగుతున్నవి చూస్తుంటే.. కరణ్ జోహార్‌కి ఆ సినిమా మీద ప్రేమ, మోజు ఇంకా తగ్గలేదు. ఈ సినిమా హిందీ రీమేక్ కోసం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా రొటీన్ రీమేక్‌లా కాకుండా.. అసలు కథకు ఏమాత్రం తగ్గకుండా రూపొందించాలని నిర్ణయించుకున్నారని వార్తలొస్తున్నాయి. అయితే మెయిన్ పాయింట్ అలానే ఉంటుంది అని చెబుతున్నారు.

బాలీవుడ్ యువ కథానాయకుడు సిద్ధాంత్ చతుర్వేది, ‘లాపతా లేడీస్’ సినిమా ఫేమ్ ప్రతిభ రంతాను హీరోహీరోయిన్లుగా ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నారట. త్వరలో ఈ రీమేక్ కాని రీమేక్ విషయంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక్కడే ఇబ్బందికర ఫలితం అందుకున్న సినిమాను అక్కడ ఎందుకు రీమేక్ చేస్తున్నారు అనే డౌట్ మీకు రావొచ్చు. అక్కడ ఇలాంటి కథలకు ఇప్పుడు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘డియర్ కామ్రేడ్’ మీద కరణ్ నమ్మకం పెట్టుకున్నారట.
ఇక్కడ విజయ్‌కి, విజయ్ ఫ్యాన్స్‌కి, రష్మికకి, రష్మిక ఫ్యాన్స్‌కి ఇబ్బందికర ఫలితం అందించిన కథ.. అక్కడ విజయం అందుకుంటుందా అనేది చూడాలి. ఒకవేళ ఈ సినిమా మంచి ఫలితం అందుకుంటే.. మరోసారి సౌత్ సినిమా రీమేక్‌ల మీద బాలీవుడ్ దృష్టి పెడుతుంది.
