టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య (Naga Chaitanya), ప్రముఖ నటి శోభిత దూళిపాళ (Sobhita Dhulipala) వివాహం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ ఘనమైన వేడుక జరగనుంది. ఈ వివాహ వేడుకకి అత్యంత దగ్గరి బంధువులు, కొద్ది మంది సెలబ్రిటీలు మాత్రమే హాజరుకానున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే పెళ్లి ఆహ్వాన పత్రిక వైరల్ అవుతూ, వివాహం ఏర్పాట్ల గురించి అనేక వివరాలను బయటపెట్టింది. ఆహ్వాన పత్రికలో శోభిత పేరుకు ముందు “లక్ష్మీ” అనే పేరు ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం.
శోభిత పేరుకు ముందు “లక్ష్మీ” అనే పేరు రాయడంపై పలువురు ఆసక్తిగా చర్చిస్తున్నారు. ఇది శోభిత పూర్తి పేరులో భాగమా? లేక మరేదైనా సాంప్రదాయ ప్రకారం ఈ పేరు రాశారా? అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే, ఈ పేరును రాయడం వెనుక నాగ చైతన్య కుటుంబం నుంచి వచ్చిన సలహా ఉందన్న చర్చ జరుగుతోంది. ఈ వివాహ పత్రికలో శోభిత తల్లిదండ్రుల పేర్లు కూడా చేర్చడం మరో ప్రత్యేకతగా నిలిచింది.
ఇది నాగ చైతన్య కుటుంబం వారు వీరికి ఇచ్చే గౌరవానికి నిదర్శనమని చెప్పవచ్చు. వివాహ వేడుక అతి సాంప్రదాయబద్ధంగా జరుగుతుందని తెలుస్తోంది. శోభిత ఈ వేడుకలో అత్యంత నిరాడంబరంగా కనిపించనుంది. ఆమె నగల కోసం ప్రముఖ బ్రాండ్స్ కాకుండా కాంచీవరం చీరలు, భారతీయ జ్యువెలరీని ఎంపిక చేశారని సమాచారం. చైతన్య తల్లి లక్ష్మి దగ్గుబాటి కోరిక మేరకు, ఆమె స్వయంగా శోభితకు ప్రత్యేకంగా బంగారు ఆభరణాలను తయారు చేయించిందట.
ఈ నగలను వివాహ వేడుకలో స్వయంగా ఆమె శోభితకు అందజేస్తారని తెలిసింది. నాగ చైతన్య తాతగారి లెగసీని గౌరవిస్తూ, ఈ పెళ్లి పూర్తిగా తెలుగు సంప్రదాయాలు, కుటుంబ విలువలకు అనుగుణంగా జరగనుంది. ఈ వివాహానికి టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలు పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నారు. ఎంతో కాలంగా చైతన్య, శోభిత బంధం గురించి చర్చలు సాగుతూ ఉండగా, ఇప్పుడు పెళ్లి ముహూర్తం ఖరారవ్వడంతో అభిమానులు కూడా ప్రత్యేకంగా విషెస్ అందిస్తున్నారు.