కింగ్ నాగార్జున తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగచైతన్య మంచి విజయాలను అందుకున్నారు. తనకంటూ గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాగే తాను ప్రేమించిన సమంతని పెళ్లిచేసుకున్నారు. మరి అసంతృప్తితోనే ఉండడం ఏమిటి ?.. ఎందుకు బాధపడుతున్నారు? తెలుసుకోవాలని ఉంది కదూ.. అయితే ఆ విషయంలోకి వెళ్లిపోవాల్సిందే.. సినిమాల్లో మాస్ కథలకు ఉండే ఆదరణే వేరు. మాస్ ని మెప్పిస్తే కలెక్షన్లు పెరుగుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ మాస్ లో ఫాలోయింగ్ పెరగాలని, అటువంటి సినిమాలు చేయాలనీ ఆశపడుతుంటారు. నాగ చైతన్య కూడా “దడ”, “తడాఖా”, “ఆటోనగర్ సూర్య”, “దోచేయ్”.. ఇలా చాలానే యాక్షన్ సినిమాలు చేశారు.
కానీ అవేవీ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. తనకి విజయాన్ని ఇచ్చిన సినిమాలు.. ఏ మాయ చేసావే, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం.. అన్నీ ప్రేమకథలే. ఈ జోనర్ నుంచి మెట్టు ఎక్కుదాం అని ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు. అదే బాధలోనే ఉన్నారు. ఆ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. “యాక్షన్ సినిమాతో హిట్టు కొట్టాలని నాకు ఎప్పట్నుంచో కోరిక ఉంది. ఎన్ని విజయాలందుకున్నా ఆ జానర్ సినిమాలతో హిట్టు కొట్టలేదన్న బాధ నాలో ఉంది. నా కొత్త సినిమా ‘శైలజా రెడ్డి అల్లుడు’లో కొంత వరకు యాక్షన్ అంశాలున్నాయి. అయితే పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేసి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా” అని చైతూ వెల్లడించారు. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన శైలజా రెడ్డి అల్లుడు ఈనెల 13 న రిలీజ్ కానుంది. అత్తగా రమ్యకృష్ణ నటించిన ఈ చిత్రంపై పాజిటివ్ టాక్ ఉంది.