ఒకప్పుడు హీరోల కెరీర్లో మైలు రాళ్లు అంటే 100వ సినిమా అనేవారు. ఆ తర్వాత 50వ సినిమాను కూడా మైలురాయిలానే చూస్తున్నారు. ఎందుకంటే హీరోల వేగం తగ్గింది, కెరీర్ స్పాన్ కూడా తగ్గుతూ వస్తోంది. అందుకే ఈ మార్పు జరిగింది. ఇప్పుడు 25వ సినిమాను కూడా పెద్ద మైలురాయిగానే చూసే పరిస్థితి వచ్చింది. అలాంటి ఓ మైలురాయికి రెండు సినిమా దూరంలో ఉన్నాడు యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య. ఆ సినిమానే ఇప్పుడు ఫిక్స్ అయింది అంటున్నారు.
‘తండేల్’ (Thandel) సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు నాగచైతన్య (Naga Chaitanya). అంతేకాదు రూ.100కోట్ల క్లబ్‌లో కూడా అడుగు పెట్టాడు. ఆ సినిమా అతనికి 23వది కావడం గమనార్హం. ఇక 24వ సినిమాను ఇటీవల స్టార్ట్ చేశాడు. ‘విరూపాక్ష’ (Virupaksha) సినిమాఫేమ్ కార్తీక్ దండుతో (Karthik Varma Dandu) ఓ మిథికల్ థ్రిల్లర్ సినిమాగా ఆ ప్రాజెక్ట్ ఉండబోతోంది అని సమాచారం. ఈ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలో హైదరాబాద్‌లోనే ఉంటుందట. ఈ సినిమా పనులు ఇలా సాగుతుండగా.. 25వ సినిమాపై చైతు ఓ నిర్ణయం తీసుకున్నాడు అని తెలుస్తోంది.
కిశోర్ అనే ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథకు చైతన్య ఓకే చెప్పాడని సమాచారం. గతంలో ఓ లైన్‌గా విన్న కథను పూర్తిగా డెవలప్ చేసి చెప్పాక ఓకే చేశాడు అని అంటున్నారు. వైవిధ్యంగా తన పాత్ర ఉంటుందని, రెగ్యులర్ కమర్షిల్ కథ, పాత్ర కాదు అని చెబుతున్నారు. ప్రస్తుతం నిర్మాతల విషయంలో చర్చలు జరుగుతున్నాయని త్వరలో క్లారిటీ వస్తే అనౌన్స్‌మెంట్ ఇస్తారని చెబుతున్నారు. ఇక 25వ సినిమా ఇప్పటి యువ స్టార్ హీరోలకు కలసి రాని నెంబరు.
ఒకరిద్దరు కాదు చాలామంది స్టార్ హీరోలు, హీరోలకు ఈ మైలురాయి చేదు ఫలితాన్నే ఇచ్చింది. కొన్ని సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నా నిర్మాతలకు సరైన రిటర్న్స్ రాలేదు. కాబట్టి చైతన్య ఈ సినిమా కథ విషయంలో జాగ్రత్తగా ఉంటాడు అనే అనుకుంటున్నారు ఫ్యాన్స్.