ఇటీవల యంగ్ హీరో నాగశౌర్య ఫామ్ హౌస్… ప్రముఖుల పేకాటకి అడ్డాగా మారిందనే వార్త ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాగశౌర్య విల్లా పై రైడ్ జరిపిన పోలీసులు ఏకంగా 30 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. గుత్తా సుమన్ కుమార్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా.. కీలక వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.ఈ కేసు విషయమై నాగ శౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ కు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది.
అంతేకాకుండా నాగశౌర్య తండ్రిని పోలీసుల ఎదుట హాజరుకావాలని కూడా ఆ నోటీసులో ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా… ఈ మంచిరేవుల పేకాట కేసులో నాగశౌర్య తండ్రి శంకర్ ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. అనంతరం ఆయన్ని ఉప్పర్‌పల్లి కోర్టులో పోలీసులు బుధవారం నాడు హాజరుపరిచారు.విచారణలో భాగంగా… క్యాసినో కింగ్‌పిన్ గుత్తా సుమన్‌తో కలిసి శంకర్ ప్రసాద్ పేకాట దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించడం వాటిని కోర్టులో సబ్మిట్ చేయడం కూడా జరిగిందని తెలుస్తుంది.
మరోపక్క శంకర్ ప్రసాద్ బెయిల్ విషయమై కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు కూడా సమాచారం. ఏమైనా శంకర్ ప్రసాద్ అరెస్ట్ తో ఈ కేసు కొత్త మలుపు తిరిగిందనే చెప్పాలి. గుత్తా సుమనే ఈ కేసులో ప్రధాన ముద్దాయి అనుకుంటే .. హీరో నాగశౌర్య తండ్రి హస్తం కూడా ఉందని పోలీసులు తేల్చడం షాకిచ్చే అంశం.