Nag 100: చడీచప్పుడు లేకుండా మొదలైపోయిన నాగ్‌ 100.. టైటిల్‌ ఇదేనా?

నాగార్జున వందో సినిమా గురించి చాలా ఏళ్లుగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా సమయంలో ఈ సినిమా గురించి చర్చ జరిగింది. (ఇక్కడ ‘గాడ్‌ ఫాదర్‌’ ప్రస్తావన ఎందుకు అనేది ఆఖరులో చెబుతాం) ఇటీవల నాగార్జున పుట్టిన రోజు (ఆగస్టు 29) సందర్భంగా ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్‌ చేస్తారు అని అనుకున్నారంతా. నాగార్జున కూడా ఇదే మాట చెప్పారు ఓ ఇంటర్వ్యూలో. కానీ అప్పుడు ఎలాంటి ప్రకటన జరగలేదు. దీంతో ఏమైందా అని అనుకుంటుడగా.. ఇప్పుడు సినిమాను చడీచప్పుడు లేకుండా మొదలెట్టేశారు.

Nag 100

అవును, నాగార్జున వందో సినిమా మొదలైపోయింది. #King100 అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించినట్లు కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటి ప్రకారం చూస్తే.. గతంలో వార్తలు వచ్చినట్లుగా, నాగ్‌ చెప్పినట్లుగానే సినిమాను యువ తమిళ దర్శకుడు రా.కార్తిక్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తోంది. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో నాగార్జున సరికొత్త లుక్‌లో కనిపిస్తారట. మేనరిజమ్స్‌, లుక్స్‌ విషయంలో రా.కార్తిక్‌ సరికొత్తగా డిజైన్‌ చేశారట.

ఇక ఈ సినిమాకు ‘లాటరీ కింగ్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. నాగార్జునను కింగ్ అని అభిమానులు పిలుస్తుంటారు. ఇప్పుడు ఆయన సినిమాకు ‘లాటరీ కింగ్’ అని పెట్టడం వల్ల పేరు, సినిమా కాన్సెప్ట్‌ రెండూ వర్కవుట్‌ అయితాయని భావిస్తున్నారట. మరి నాగార్జున ఈ విసయంలో ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. సినిమాలో నాగార్జున సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తారంట. ఆ హీరోయిన్లను లాక్ చేశారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారట.

ముగ్గురు హీరోయిన్లలో ఒకరు సీనియర్‌ హీరోయిన్‌ కాగా, ఇద్దరు కొత్తమ్మాయిలను తీసుకోవాలని దర్శకుడు రా.కార్తిక్‌ ప్లాన్‌ చేస్తున్నారట. త్వరలోనే ప్రెస్‌మీట్‌ పెట్టి మొత్తం వివరాలు ఘనంగా ప్రకటిస్తారని సమాచారం. లేదంటే సోషల్‌ మీడియా పోస్టుతో సరిపెట్టేయొచ్చు కూడా. ఇక పైన చెప్పిన ‘గాడ్‌ ఫాదర్‌’ విషయానికొస్తే.. ఆ సినిమా దర్శకుడు మోహన్‌ రాజా డైరక్షన్‌లోనే నాగ్‌ తన వందో సినిమా చేయాలనుకున్నారు. అయితే ‘గాడ్‌ ఫాదర్‌’ కోసం ఆయన బయటకు వచ్చారు. మళ్లీ అటువైపు వెళ్లలేదు.

రజనీ – కమల్‌ని నేను డైరెక్ట్‌ చేయడం లేదు: యువ దర్శకుడు క్లారిటీ!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus