టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ముందుగా ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయాలని అనుకున్నారు కానీ.. ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ కి ఫిక్స్ అయ్యారు. దీంతో సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ క్రమంలో నాగార్జున ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. చాలా రోజులుగా నాగార్జున వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై నాగ్ క్లారిటీ ఇచ్చాడు.
ప్రస్తుతం మూడు వెబ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని చెప్పారు. కొన్ని కథలను రెండు, మూడు గంటల సినిమాల్లో చెప్పడం కుదరదని.. వాటిని ఎపిసోడ్ లుగా తెరకెక్కిస్తే మరింత రీచ్ ఉంటుందని కాబట్టి వెబ్ సిరీస్ అనేది మంచి ఆప్షన్ అని అన్నారు. వెబ్ సిరీస్ లలో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. డిజిటల్ జోన్ లో ప్రయోగాలు కూడా చేయొచ్చని అన్నారు. నాగ్ మాటలను బట్టి ఆయన డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి ఎంతో సమయం పట్టదని తెలుస్తోంది.
అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ రూపొందిస్తోన్న ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ హీరో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. మరోపక్క ‘బ్రహ్మాస్త్ర’ సినిమాతో బాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వనున్నారు. అలానే ‘బంగార్రాజు’ ప్రీప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికార ప్రకటన కొన్నిరోజుల్లో రానుంది.