తెలుగు పరిశ్రమలో 30 ఏళ్ల వయసు లోపు స్టార్ డమ్ సంపాదించిన వాళ్లు చాలా తక్కువమంది అని.. వాళ్లందరిలో జూనియర్ ఎన్టీఆర్ ముందుంటాడని అక్కినేని నాగార్జున కితాబిచ్చాడు. ఐతే స్టార్ డమ్ కోసం వెంపర్లాడాల్సిన పని లేదని.. మంచి పాత్రలు ఎంచుకుంటే దానంతట అదే వస్తుందని నాగ్ చెప్పాడు. ఊపిరి ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ నాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘స్టార్ గా కంటే నటుడిగా కొనసాగడం నాకిష్టం. సినిమాలు చేస్తూనే ఉంటాను.
కొన్ని సార్లు మంచి పాత్రలు అనిపించినప్పుడు ఇమేజ్ లాంటి విషయాల్ని పట్టించుకోను. మీ పిల్లలతో పోటీపడుతున్నారా అని నన్నడుగుతుంటారు. వాళ్లు నాకెప్పుడూ పోటీ కాదు. నా కొడుకులతో పాటు యువ కథానాయకులంతా మంచి పాత్రలు ఎంచుకోవాలి. మంచి స్ర్కిప్టులు ఎంచుకుంటే స్టార్ డమ్ దానంతట అదే వస్తుంది. మన దగ్గర 30 ఏళ్లకు ముందు స్టార్‌డమ్ వచ్చిన వాళ్లు తక్కువే. తారక్ కి అది త్వరగా వచ్చింది. మహేష్, ప్రభాస్, పవన్… ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది 30 ఏళ్ల తర్వాతే స్టార్ డమ్ వచ్చింది’’ అని నాగ్ అన్నాడు.