స్టార్ హీరో నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పరవాలేదనిపించే స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. నాగార్జున ఈ సినిమాలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రోల్ లో అద్భుతంగా నటించారని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా కలెక్షన్లు మరింత పెంచాలనే ఉద్దేశంతో నాగార్జున వైల్డ్ డాగ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ లో జరిగిన బాంబు దాడుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
నాగార్జున తాజాగా మీడియాతో మాట్లాడుతూ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వైల్డ్ డాగ్ మూవీని రిలీజ్ చేయాలా..? వద్దా..? అని ఆలోచించామని.. మంచి కథ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశామని అన్నారు. ఎలాంటి పాత్రల్లో నటిస్తున్నా ప్రోత్సహిస్తున్న అభిమానులకు తాను రుణపడి ఉంటానని నాగార్జున తెలిపారు. చాలామంది వైల్డ్ డాగ్ సినిమాను చూసి ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అని చెబుతున్నారని అదే ఈ సినిమాకు వచ్చిన ఉత్తమమైన ప్రశంస అని నాగార్జున అన్నారు.
వైల్డ్ డాగ్ లాంటి రిస్కీ కథలో నటించడం గురించి చెబుతూ నా లైఫే రిస్క్ అని రిస్క్ లు తీసుకుంటూనే ఉంటానని నాగార్జున పేర్కొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ గురించి ప్రశ్న ఎదురు కాగా నాన్న బయోపిక్ చేయాలని తన మనస్సులో కూడా ఉందని నాగార్జున వెల్లడించారు. బయోపిక్ విషయంలో ఏమైనా తప్పులు చేస్తానేమో అనే భయం కూడా ఉందని నాగార్జున తెలిపారు. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ లో నటించగా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచాయి. ఆ సినిమాల ఫలితమే ఏఎన్నార్ బయోపిక్ విషయంలో నాగార్జునను టెన్షన్ పెడుతోందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.