ఇటీవల నేచురల్ స్టార్ నాని, ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ‘సురేష్ ప్రొడక్షన్స్’ తో సహా కొందరి పై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ లో అక్కినేని నాగార్జున పేరు కూడా ఎక్కువగా వినిపించింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది. పన్ను చెల్లింపు విషయంలో తేడాలు రావడంతో ఈ తనిఖీలు జరిగినట్టు తెలుస్తుంది. ఇక నాగార్జున ఇంటితో సహా ఆయన ఆఫీస్ లపై కూడా ఐటీ అధికారులు దాడి చేసినట్టు వస్తోన్న వార్తల పై తాజాగా నాగార్జున తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
నాగార్జున మాట్లాడుతూ.. ‘నాకు ఫోన్ చేసి మరీ మీ ఆస్తులపై ఐటీ రైడ్స్ జరిగాయట కదా అని కొందరు అడుగుతున్నారు. ఈ విషయం పై ఎంతో బాద పడ్డాను. అలా ఫోన్ చేసిన వారిలో నా స్నేహితులు కూడా ఉన్నారు. నాపై వచ్చిన ఇలాంటి వార్తలు చాలా ఇబ్బందికరంగా అనిపించాయి. ఆ వార్తల్లో ఎంత వరకూ నిజం లేదు’ అంటూ నాగార్జున తన బాధను వ్యక్తం చేశారు. ఇక ఇప్పటివరకూ ‘బిగ్ బాస్ సీజన్ 3’ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ వచ్చిన నాగార్జున ఇప్పుడు తన తదుపరి సినిమా పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.