ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల పై ప్రశంసలు కురిపించిన నవీన్ చంద్ర..!

‘అందాల రాక్షసి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నవీన్ చంద్ర. ఆ చిత్రంలో తన నటనకు మంచి స్పందన దక్కింది. ఆ తర్వాత ‘దళం’ ‘నా రాకుమారుడు’ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ వంటి చిత్రాల్లో నటించినా… అవన్నీ ప్లాపులు గానే మిగిలాయి.దీంతో హీరోగా మాత్రమే కాదు అసలు అవకాశాలే రాలేదు. ఈ తరుణంలో నాని హీరోగా వచ్చిన `నేను లోకల్` చిత్రంలో నెగెటివ్ రోల్ పోషించాడు. ఈ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. తరువాత ‘దేవదాస్’ చిత్రంలో కూడా అవకాశం వచ్చింది అయితే ఆశించిన అవకాశాలైతే రాలేదు.

అటువంటి సమయంలో వచ్చిన `అరవింద సమేత` నవీన్‌కు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఎన్టీయార్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో నవీన్ ఓ విలన్‌గా నటించాడు. ఆ చిత్రంతో వచ్చిన క్రేజ్ వలనే ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల నవీన్ నూతన చిత్రం ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా `అరవింద సమేత` గురించి నవీన్ మాట్లాడాడు. “వరుస ఫ్లాప్‌లతో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో నాకు `అరవింద సమేత` ఆఫర్ వచ్చింది. నేను క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ‘బాలిరెడ్డి’ పాత్ర చేయమని త్రివిక్రమ్‌గారు, ఎన్టీయార్‌గారు నన్ను అడిగారు. దీంతో నాకు మళ్ళీ ఊపిరి అందినట్టయ్యింది. నా కెరీర్ మళ్ళీ నిలబడింది. ఆ సినిమాలో ఎన్టీయార్, త్రివిక్రమ్‌ ఛాన్స్ ఇవ్వకపోయుంటే నా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికే భయమేస్తుంది”.. అంటూ నవీన్ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus