రీఎంట్రీలో రాజశేఖర్ వరుస సినిమాలు చేయాలని అనుకున్నారు. అందుకుతగ్గట్టుగానే ‘గరుడవేగ’ తర్వాత వరుస సినిమాలు ఓకే చేశాడు. అయితే ‘గరుడవేగ’ తర్వాత వచ్చిన ‘కల్కి’ ఆకట్టుకోలేదు. అయితే రీఎంట్రీ జోరును లైవ్‌లో ఉంచడానికి ‘జోసెఫ్’ అనే సినిమాను ఓకే చేశాడు. నీలకంఠ దర్శకత్వంలో ఆ సినిమా ఉంటుందని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఆ సినిమా నుంచి నీలకంఠ తప్పుకున్నారట. ‘జోసెఫ్’ ప్రకటించిన కొద్ది రోజులకు లాక్‌డౌన్ మొదలైంది. దీంతో సినిమా చిత్రీకరణ వాయిదా పడుతూ వచ్చింది.
ఈలోగా రాజశేఖర్‌కు కరోనా సోకింది. దీంతో మళ్లీ వాయిదాల పర్వం మొదలైంది. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడ్డాక సినిమాలు చేయాలని రాజశేఖర్ అనుకోవడమే దీనికి కారణం. సినిమా ఆలస్యం అవుతుండటంతో నీలకంఠ వేరే సినిమా పనిలో పడ్డారు. ఈలోగా ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. ఈ నేపథ్యంలో నీలకంఠ ‘జోసెఫ్’ నుంచి తప్పుకున్నారట. ఫిబ్రవరి 4న రాజశేఖర్ జన్మదినం. ఆ సందర్భంగా సినిమాను ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తోంది. ఈలోగా నీలకంఠ తప్పుకోవడంతో, కొత్త దర్శకుడిని వెతికే పనిలో చిత్రబృందం ఉందట.
వీలైనంత త్వరగా దర్శకుడిని సిద్ధం చేసుకొని సినిమాకు కొబ్బరికాయ కొడతారట. ఎవరూ సెట్‌కాకపోతే జీవితనే దర్శకత్వం వహిస్తారనే వార్తలూ వినిపిస్తున్నాయి. మరి ఏమవుతుందో చూడాలి. 2018లో వచ్చిన మలయాళ సినిమా ‘జోసెఫ్’కి ఇది రీమేక్ కావడం గమనార్హం.