తమిళంలో చిన్న చిత్రంగా రూపొంది మంచి విజయం అందుకొన్న చిత్రం “అదే కంగల్”. ఈ చిత్రాన్ని ఆది పినిశెట్టి హీరోగా తెలుగులో రీమేక్ చేశారు. తాప్సీ, రితీక సింగ్ హీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రాన్ని కోన వెంకట్ నిర్మించగా “లవర్స్” చిత్రానికి దర్శకత్వం వహించిన హరినాధ్ చాలా ఏళ్ల విరామం ఆనంతరం ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. మరి తమిళనాట మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులని ఏమేరకు అలరించిందో చూద్దాం.
కథ : కళ్యాణ్ (ఆది పినిశెట్టి) హైద్రాబాద్ లో వెరీ పాపులర్ బ్లైండ్ చెఫ్. సొంతంగా ఒక రెస్టారెంట్ ను రన్ చేస్తూ ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తాడు. కళ్యాణ్ చిన్నప్పటి స్నేహితురాలైన అను (రితీక సింగ్) అతడ్ని ఇష్టపడడమే కాకుండా అతడి లోపాన్ని పట్టించుకోకుండా అతడ్నే పెళ్లాడాలని ఫిక్స్ అవుతుంది. వీళ్ళిద్దరి పెళ్ళికి ఇరు కుటుంబాల పెద్దల అంగీకారం కూడా లభిస్తుంది. సరిగ్గా అప్పుడే కళ్యాణ్ జీవితంలోకి ప్రవేశిస్తుంది వెన్నెల (తాప్సీ). తన లోపాన్ని చూసి జాలిపడకుండా, తనను ఇష్టపడుతున్నందుకు సంతోషిస్తాడు కళ్యాణ్. ఇద్దరూ దగ్గరై.. కళ్యాణ్ ప్రపోజ్ చేయడానికి రెడీ అయినప్పుడు.. తమ కుటుంబం కాల్ మనీ కారణంగా ఇబ్బందుల్లో ఉందని, వాళ్ళకి గనుక ఇమ్మీడియట్ గా అప్పు తీర్చకపోతే చంపేస్తారని తనకున్న సమస్యను బయటపెడుతుంది వెన్నెల.
అయితే.. నెక్స్ట్ డే ఆ డబ్బుని సెటిల్ చేసి వెన్నెలని పెళ్లాడి జీవితాంతం సంతోషంగా ఉండాలని ప్లాన్ చేసిన కళ్యాణ్ ఆశలు ఒక కార్ యాక్సిడెంట్ కారణంగా చెల్లాచదురవుతాయి. అయితే.. ఆ యాక్సిడెంట్ లో కళ్యాణ్ కి కంటి చూపు వస్తుంది. కళ్ళు తెరిచేసరికి తాను ప్రేమించిన వెన్నెల ఏమయ్యిందో తెలియదు, ఆమె కోసం ఎంత వెతికినా కనిపించదు. కళ్యాణ్ జీవితంలో నుంచి వెన్నెల హటాత్తుగా ఎందుకు మాయమైంది? ఆమెను వెతుక్కుంటూ వెళ్ళిన కళ్యాణ్ కి తెలిసిన విషయాలేమిటి? కళ్యాణ్ ను ఇష్టపడిన అను పరిస్థితి ఏమైంది? వంటి ప్రశ్నలకు సమాధానాల సమాహారమే “నీవెవరో” కథాంశం.
నటీనటుల పనితీరు : “రంగస్థలం” చిత్రంలో కుమార్ బాబుగా అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొన్న ఆది పినిశెట్టి ఈ చిత్రంలో బధిరుడిగా పర్వాలేదనిపించుకొన్నాడు. నటుడిగా ఆది పినిశెట్టికి ఉన్న ప్రత్యేకమైన బలం ఎలాంటి ఎమోషన్స్ అయినా అద్వితీయంగా పలికించగలగడం. కానీ.. ఈ చిత్రంలో దర్శకుడు ఆది నుంచి మంచి పెర్ఫార్మెన్స్ రాబట్టుకోలేకపోయాడు. “నీవెవరో” లాంటి లాజికల్ క్రైమ్ థ్రిల్లర్ లోనూ ఆదికి మాస్ ఇమేజ్ ఇవ్వడానికి ప్రయత్నించడం మైనస్ అనే చెప్పాలి.
తాప్సీ పాత్రలో ఉన్న సస్పెన్స్ ఫ్యాక్టర్ ఆమె పెర్ఫార్మెన్స్ లో కనిపించదు. ఆమె క్యారెక్టర్ లో ఉన్న డిఫరెంట్ షేడ్స్ ఆమె కాస్ట్యూమ్స్ లో కనిపించినంతగా.. బాడీ లాంగ్వేజ్ లో కనిపించకపోవడం, ఆమె పాత్రకు ఉన్న ఎలివేషన్ ను డైరెక్టర్ సరిగా యూటిలైజ్ చేసుకోకపోవడంతో ఆ పాత్రతో క్రియేట్ అవ్వాల్సినంత ఇంపాక్ట్ ఉండదు. రితీక సింగ్ పక్కింటి అమ్మాయి పాత్రలో అలరించడానికి చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. ఆమె పాత్రలో సహజత్వంతోపాటు.. పాత్రకి పెద్దగా ప్రాముఖ్యత కూడా లేకపోవడంతో ఆమె పాత్రకి ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ అవ్వరు. కానిస్టేబుల్ చొక్కారావు పాత్రలో వెన్నెల కిషోర్ కామెడీ రెండుమూడు సార్లు మాత్రమే కాస్త నవ్వించగలిగింది. సింగిల్ లైనర్స్, పంచ్ డైలాగ్స్ లో ప్రాసలు తప్ప హాస్యం లేకపోవడంతో అవేమీ పెద్దగా పేలలేదు.
సాంకేతికవర్గం పనితీరు : సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగున్నప్పటికీ.. ఎడిటింగ్ & కట్స్ సరిగా లేకపోవడంతో సినిమా మొత్తం చాలా సింపుల్ గా వెళ్లిపోతున్న ఫీలింగ్. ముఖ్యంగా ఎక్కడా పాజ్ లు ఇవ్వకుండా పరిగెట్టిన స్క్రీన్ ప్లేలో ఒక థ్రిల్లర్ చిత్రానికి ఉండాల్సిన బ్రేకింగ్ పాయింట్స్ లేకపోవడం మైనస్. అచ్చు అందించిన పాటల్లో “వెన్నెల ఓ వెన్నెల” మినహా మిగతావన్నీ రెగ్యులర్ గా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ సెకండాఫ్ లో చూపినంత ఇంపాక్ట్ ఫస్టాఫ్ లో చూపించలేదు. చాలా సన్నివేశాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ సింక్ అవ్వలేదు. సినిమాకి ఎడిటింగ్ అనేది పెద్ద మైనస్, అలాగే ఒరిజినల్ వెర్షన్ లో చేసిన మార్పులు కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.
“లవర్స్” చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన హరినాధ్ చాలా ఏళ్ల విరామం అనంతరం తెరకెక్కించిన ‘నీవెవరో” చిత్రం విషయంలో చాలా తప్పులు చేశాడు. ఒరిజినల్ వెర్షన్ స్క్రీన్ ప్లేను ఏమాత్రం మార్చని హరినాధ్.. హీరోకు మాస్ అప్పీల్ ఇవ్వడం కోసం యాడ్ చేసిన ఫైట్ సీక్వెన్స్ లు, తాప్సీ పాత్రకు, ఆమె చేసే పనులకు కారణంగా చూపిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో చేసిన మార్పులు కథనాన్ని స్లో చేశాయి తప్ప పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఒరిజినల్ వెర్షన్ లో హీరో అనేవాడు చాలా సాధారణమైన వ్యక్తిగా చూపిస్తారు, అందువల్ల ప్రేక్షకులు అతడు చేసే రెగ్యులర్ పనులకి చాలా ఈజీగా రెస్పాండ్ అవుతుంటారు. కానీ.. తెలుగు వెర్షన్ లో హీరోని కళ్ళు లేని సూపర్ మ్యాన్ లా చూపించడం వల్ల ఒక మాస్ మసాలా చిత్రాన్ని చూస్తున్న ఫీల్ తప్ప ఏ ఒక్క సన్నివేశంలోనూ ఇదొక థ్రిల్లర్ అనే భావన ప్రేక్షకులకి కలగదు. కొన్ని సన్నివేశాలను ఎందుకు యాడ్ చేశారో అర్ధం కాదు, ఇంకొన్ని మంచి సన్నివేశాలను ఎందుకు తొలగించారో తెలియదు.
విశ్లేషణ : ఒరిజినల్ వెర్షన్ “అదే కంగల్”ను చూడకపోతే ఓ మోస్తరుగా అలరించే ఈ చిత్రం, ఒరిజినల్ వెర్షన్ ను చూసినవాళ్లని మాత్రం పెద్దగా ఎంటర్ టైన్ చేయకపోగా.. ఆకట్టుకోలేదు కూడా. మొత్తానికి “నీవెవరో” ఓ బ్యాడ్ రీమేక్ గా మిగిలిపోయింది.
రేటింగ్ : 1.5/5