సినిమాలను యువతను తప్పుదారి పట్టిస్తున్నాయి అంటారు. అయితే ఇక్కడో సినిమాల్లో తప్పులు చూపించినప్పుడు ఆ దారిలో వెళ్తే సినిమాలది తప్పు అనొచ్చు. అయితే సినిమాలో మంచి చూపించినా యువత తప్పు దారిలో దానిని తీసుకుంటే ఏం చేయాలి? ఈ చర్చ ఇప్పటిది కాదు. ఎప్పటి నుండో నడుస్తోంది. దీనికి సమాధానం చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే దీనికి ఓ అనుబంధ చర్చ కూడా ఉంది. సినిమాలో చూపించేది బయట జరిగినదే అని కొందరు అంటుంటారు. ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎందుకు అని అనుకుంటున్నారా? ఉంది.. కారణం ఉంది.
‘వినరో భాగ్యము విష్ణు కథ’ అంటూ కిరణ్ అబ్బవరం హీరోగా ఓ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఇటీవల ఆ సినిమా ట్రైలర్ విడుదలైంది. అందులోని కాన్సెప్ట్ జనాలకు ఎక్కుతుందా.. సినిమా హిట్టవుతుందా అని ఓవైపు నిర్మాతలు ఆలోచిస్తుంటే.. నెటిజన్లు, సినిమా జనాలు మాత్రం దానికి వేరే విధంగా వాడుతుండటం ఇబ్బంది కలిగిస్తోంది. నెంబర్ నెయిబర్ అనే కాన్సెప్ట్‌తో ఆ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. అంటే మీ మొబైల్ నెంబరు ముందు, వెనుక ఉన్న నెంబర్ల వాళ్లు నెయిబర్స్ అని అర్థం.
మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆ నెయిబర్స్ సాయం చేసినా చాలు అనేది సినిమా పాయింట్. సినిమాలో హీరో ఆ పాయింట్ పట్టుకుని ఏం చేశాడు, ఎవరు కష్టాల్లో ఉన్నారు అనేది సినిమా. అయితే ఈ మంచి విషయాన్ని పట్టుకుని కొంతమంది ఆకతాయిలు నెయిబర్ నెంబర్స్‌కు కాల్ చేసి అమ్మాయిల కాంటాక్ట్ దొరికితే వేధిస్తున్నారని చర్చ నడుస్తోంది. దీంతో ఇలాంటి టాపిక్‌తో సినిమా చేయడం సరికాదంటూ కిరణ్ అబ్బవరంను అంటున్నారు కొంతమంది నెటిజన్లు. మంచి చెబితే దానిని చెడుకు వాడుకుంటే ఆయనేం చేస్తారు పాపం.
అయితే ఇక్కడో విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ముగ్గురు సాయం చేయండి, ఆ ముగ్గురిని మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పండి అని ‘స్టాలిన్’ సినిమాలో చిరంజీవి చెబితే ఇలానే ఎగతాళి చేశారు అప్పట్లో కొంతమంది. అలా మంచి చెబితే మేం వినం అనే జనాలు ఉన్న ఈ సమాజంలో హీరోలు మంచి చెబితే ఇలానే ఉంటుంది అనే చర్చ కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది.