ఈమధ్య మనుషులు ఇంకా తుదిశ్వాస విడువక ముందే ఆన్లైన్ లో వాళ్ళ ఊపిరి తీసేస్తున్నారు కొందరు కంగారు నెటిజన్లు. పాపం కోట శ్రీనివాసరావు లాంటి సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ కూడా ఒకానొక సందర్భంలో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ “దయచేసి నన్ను చంపకండయ్యా.. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. దయచేసి నేను బ్రతికి ఉండగానే తప్పుడు వార్తలు, యూట్యూబ్ తంబ్ నెయిల్స్ తో నన్ను చంపకండి” అని వేడుకొన్నారు. ఇక సునీల్, వేణు, లయ, బాబు మోహన్ వంటి వారందరూ ఈ తరహా ఇబ్బందులను ఎదుర్కొన్నవారే. తాజాగా ఈ సోషల్ మీడియా చంపేసిన సెలబ్రిటీ స్టార్ కమెడియన్ వేణుమాధవ్.
ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే.. నిన్న సాయంత్రం ఆయన పరిస్థితి ఇంకాస్త క్షీణించడంతో ఆయన చనిపోయాడని వార్తలు హల్ చల్ చేయడం మొదలైంది. చాలా మంది నటిజన్లు “రిప్ వేణుమాధవ్” అని పోస్టులు పెట్టడం మొదలెట్టారు. అయితే.. ఆయన ఇంకా క్షేమంగానే ఉన్నారని.. దయచేసి ఆయన్ని చంపకండి అంటూ ఆయన కుటుంబ సభ్యులు వేడుకొంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని కూడా వారు పేర్కొన్నారు. అయితే.. వార్తలు ముందుగా తామే అందించాలని తాపత్రయపడే కొన్ని వెబ్ సైట్లు, ఇంకొందరు నెటిజన్లు ఇలా ఎమోషన్స్ తో ప్లే చేయడం అనేది సమంజసం కాదు. ఇకనుంచైనా ఈ సోషల్ మీడియా చావులకు తెరపడితే బాగుండు.