రాజులు, రాజ్యాలు ఉన్నప్పుడు ఎలా ఉండేదో మనం చూడలేదు కానీ.. కథల్లో, సినిమాల్లో, నవలల్లో చూడటమే. రాజుకు వ్యతిరేకంగా మాట్లాడితే.. ఎవరూ సహించేవారు కాదు. వాళ్ల మీద కచ్చితంగా శిక్ష ఉండేది. తమ కష్టాలు చెప్పుకోవడానికో, తమ బాధలు వెలిబుచ్చడానికో, లేకపోతే తమ ఏడుపు ఏడవడానికి కూడా అవకాశం ఉండేది కాదట. ఎవరో కొంతమంది రాజులు మాత్రమే అలా ఉండేవారు అనుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి ఉందని రాజకీయ నాయకులు అంటున్నారు.
అలాంటి పరిస్థితే మూవీ ఆర్టిస్ట్ అసోసియషన్ (మా)లోనూ తీసుకొస్తున్నారా? మంచు విష్ణు మాటలు వింటుంటే అలానే అనిపిస్తోంది. ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికై సంవత్సరం పూర్తయిన సందర్భంగా మంచు విష్ణు.. ఇటీవల మీడియాతో మాట్లాడాడు. ఏడాది పూర్తయిన సందర్భంగా తమ ప్యానెల్ సాధించిన ఘనతలను వివరిస్తూ.. ఏమేం పనులు కొత్తగా చేద్దాం అనుకుంటున్నాడో చెప్పాడు. ఈ క్రమంలో క్రమశిక్షణ చర్యల్లో కొత్తగా తీసుకొస్తున్న వాటి గురించి క్లుప్తంగా వివరించారు. అవి వింటుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరహాలో ఉన్నాయి అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘మా’కు వ్యతిరేకంగా నటులు, కార్యవర్గ సభ్యులు ధర్నాలు చేసినా, సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టినా వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తామని మంచు విష్ణు తెలిపారు. దీనిపై ఇప్పుడు చిన్నపాటి ఆందోళన మొదలవుతోంది. ‘మా’లో ఏం జరిగినా, ప్యానెల్ సభ్యులు ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏమీ అడగొద్దు, అనొద్దు, తమ నిరసన తెలియజేయొద్దు అని విష్ణు చెప్పాలనుకుంటున్నారా? అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంలో ‘మా’ సభ్యులు ఏమంటారు అనేది మరో విషయం.
గతంలో ఇదే తరహాలో చిరంజీవి కూడా మాట్లాడారు. ‘మంచి మైకులో చెప్పండి.. చెడు చెవిలో చెప్పండి’ అని. ఇప్పుడు విష్ణు అండ్ మోహన్‌బాబు చెబుతున్నదీ ఇదే. అయితే ఈసారి ఏకంగా మంచు విష్ణు సభ్యత్వం రద్దు అని అంటున్నారు. గత ఎన్నికల్లో ఇలాంటి పోస్టులు చాలా కనపించాయి. విష్ణు ప్యానల్ నుండి కూడా ఇలాంటి పోస్టులు, నిరసనలు వచ్చాయి. మరి పాత వారిపైనా యాక్షన్ ఉంటుందేమో చూడాలి.