విజయ్ ఆంటోని హీరోగా రూపొందిన ‘బిచ్చగాడు’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తమిళంలో 2016 మార్చి 4న ఈ చిత్రం విడుదలైంది. అటు తర్వాత తెలుగులో 2016 మే 13న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయిన ఏడాదే… అంటే 5 నెలల తర్వాత నరేంద్ర మోదీ దేశంలో నోట్ల రద్దు విధించడం జరిగింది. అప్పుడు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. ఇక 7 ఏళ్ళ తర్వాత..
అంటే 2023 మే 19న ‘బిచ్చగాడు 2’ సినిమా రిలీజ్ అయ్యింది. ఈసారి కూడా రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు.. ఆర్.బి.ఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ప్రకటించింది. ఈ విషయం పై సోషల్ మీడియాలో తెగ డిస్కషన్ నడుస్తుంది. ‘బిచ్చగాడు’ రెండు పార్ట్ లు కూడా మే నెలలోనే రిలీజ్ అయ్యాయి. అందువల్లే ‘బిచ్చగాడు'(సీక్వెల్స్) వచ్చిన ప్రతీసారీ ఇలా నోట్లు రద్దు పథకం వస్తుంది అంటూ సోషల్ మీడియాలో జనాలు డిస్కస్ చేసుకుంటున్నారు.
నిజానికి ‘బిచ్చగాడు’ సినిమాలకి… నోట్ల రద్దుకు ఎలాంటి సంబంధం లేదు. యాదృచ్చికంగా ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయితే సోషల్ మీడియాలో జనాలు ‘విజయ్ ఆంటోనీ గారు .. ఇక బిచ్చగాడు కి సీక్వెల్స్ తీయకండి. మీరు తీస్తే నోట్ల రద్దు పథకాలు వస్తున్నాయి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.నిన్న రిలీజ్ అయిన ‘బిచ్చగాడు 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. మాస్ ఏరియాల్లో ఈ మూవీ బాగా పెర్ఫార్మ్ చేస్తుంది.