సినిమా షూటింగ్ అంటే 10, 20 మందితో సాగే పని కాదు. దీంతో కరోనా స్పాట్లుగా షూటింగ్‌లు మారే అవకాశం ఉందంటూ నిపుణులు చాలా రోజులుగా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ ఇన్నింగ్స్ దేశంలో దారుణంగా కొనసాగుతోంది. దీంతో చాలా రంగాలు తిరిగి కష్టాల్లోకి జారుకుంటున్నాయి. వాటిలో సినిమా రంగం కూడా ఒకటి. దీంతో సినిమా షూటింగ్స్‌లో కరోనా ప్రభలకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు. తాజాగా దీనికి సంబంధించి ది ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.
అంతేకాదు వాటిని అనుసరించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది కూడ. ఎఫ్‌డబ్లూఐసీఈ కొత్త నియమావళి ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. దాని ప్రకారం సోమవారం నుండి శుక్రవారం వరకే షూటింగ్స్ జరపాలి. ఇక గైడ్‌లైన్స్ చూస్తే… ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉన్న సన్నివేశాలను చిత్రీకరించకూడదు. దాంతోపాటు గ్రూప్ సాంగ్స్ షూట్స్ ఇప్పుడు నిర్వహించకూడదు. సినిమా లొకేషన్స్, ప్రొడక్షన్ ఆఫీసులు, పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోల్లో క్రమం తప్పకుండా శానిటైజేషన్ చేయాలి. అందులో పని చేసేవారు కచ్చితంగా మాస్క్ ధరించాలి.
షూటింగ్స్ జరిగే లొకేషన్లకు తరచుగా ఎఫ్‌డబ్ల్యూఐసీఈ బృందం వెళ్లి అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. కొవిడ్ నిబంధనలు పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ తెలిపింది. వారాంతంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ రోజుల్లో చిత్రీకరణలు జరుపడానికి వీల్లేదు.